జగన్ దేవుడు-రాజకీయాలతో పనిలేదు - క్షమించి ఉద్యోగమివ్వరూ- డాక్టర్ సుధాకర్ యూటర్న్...
విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి డాక్టర్ సుధాకర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో సీఎం జగన్ ను నానా బూతులు తిట్టిన సుధాకర్ తాజాగా ఆయన్ను దేవుడంటూ ఆకాశానికెత్తేశారు. మెంటల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక తొలిసారి జనం ముందుకు వచ్చిన సుధాకర్ పలు సంచలన విషయాలు వెల్లడించారు. అదే సమయంలో తన ఉద్యోగం తిరిగి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. సుధాకర్ తాజా వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
Recommended Video

డాక్టర్ సుధాకర్ యూటర్న్...
విశాఖ మానసిక చికిత్సాలయం నుంచి హైకోర్టు ఆదేశాలతో బయటికి వచ్చాక అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన డాక్టర్ సుధాకర్ గతంలో పోలీసులు సీజ్ చేసిన తన కారును తీసుకెళ్లేందుకు నాలుగో టౌన్ పోలీసు స్టేషన్ కు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన సుధాకర్ గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు పూర్తి విరుద్ధమైన వ్యాఖ్యలను వినిపించారు. గతంలో జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సుధాకర్ ఇప్పుడు ఆయన్ను దేవుడంటూ ఆకాశానికెత్తేశారు. గతంలో జరిగిన వివాదంలో తప్పు ఎవరిది ఉన్నా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ను సుధాకర్ కోరారు.

మోడీని తిట్టే ధైర్యం లేదు, టీడీపీ ముద్ర వేశారంటూ...
ప్రధాని మోదీపై మద్దెలపాలెంలో చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా.. ప్రధాని మోడీ గారిని కూడా నేను తిట్టలేదు. వాళ్లను తిట్టే ధైర్యం ఉందా?, శత్రువులను కూడా నేను తిట్టను. ప్రధాని మోదీ అంటే ఎంతో ఇష్టం. అలాంటి నాయకుడ్ని తిడతానా?, ఇక జగన్ గారైతే పేదల పాలిట మంచి పనులే చేస్తున్నారు. నాకు ఆ పార్టీ.. ఈ పార్టీ అంటూ ఏమీ ఉండదన్నారు. చంద్రబాబు పార్టీ అంటూ ముద్ర వేస్తున్నారని, ఆయన హయాంలో కూడా పని చేశాను. చంద్రబాబు కార్యకర్తనైతే కాదు. అందరూ బాగానే పాలించారు. అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లడమే తాను చేసిన పెద్ద తప్పు అంటూ సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ రోజు జరిగింది ఇదే....
తాను నర్సీపట్నం ఆస్పత్రిలో సస్పెండ్ దగ్గర నుంచి పిచ్చాస్పత్రి ఘటన వరకూ ఏం జరిగిందో సుధాకర్ పూర్తిగా వివరించారు. ‘‘సస్పెండ్ అయిన దగ్గర నుంచి బ్యాడ్ ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. టార్చర్ భరించలేక బయటకు వెళ్లడానికి కూడా భయపడ్డా. బ్యాంక్ పనిమీద నక్కపల్లి వెళ్లాల్సి వచ్చింది. అలా వెళ్తుండగా ఎవరో ఫాలో అవుతున్నారని కారు ఆపా. అప్పటికే కారులో కొంత డబ్బు ఉంది.. వెంబడిస్తున్నారని కారు దిగితే అల్లరిమూకలు తనపై దాడి చేశారు. పోలీసులకు కూడా తన గురించి తప్పుడు సమాచారం ఇచ్చారు. తప్పుడు పనులు చేస్తున్నట్లుగా పోలీసులకు కంప్లైంట్ చేశారని ఆ రోజు ఘటనను సుధాకర్ గుర్తు చేసుకున్నారు.

ఉద్యోగం తీసేందుకు కుట్రతోనే దాడి...
అయినా ప్రభుత్వాన్ని తిట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని సుధాకర్ ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఎవరికో చెడ్డ పేరు తెచ్చేందుకే తనపై దాడి చేశారని, పిచ్చోడి ముద్ర వేసి జాబ్ తీసేయాలని కుట్ర పన్నారని, తనకు గుండు గీసిందెవరో వారి పేరు చెప్పనని సుధాకర్ చెప్పుకొచ్చారు. ఆ విషయాలు చెప్పానంటే మళ్లీ గొడవ మొదలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తాను ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, పేదలకు సేవ చేయాలనే ఉద్యోగం చేస్తున్నట్లు సుధాకర్ వెల్లడించారు.

క్షమించి ఉద్యోగం ఇవ్వాలని జగన్ కు వినతి...
సస్పెన్షన్ తర్వాత జీతం రాక ఇంట్లో ఇబ్బంది పడుతున్నట్లు చెప్పుకొచ్చిన సుధాకర్... ముఖ్యమంత్రి జగన్ క్షమించి తన ఉద్యోగం ఇప్పించాలని కోరారు. తనను ఎవరూ ఉపయోగించుకోలేదని, అలా చేసుంటే వారిపై యాక్షన్ తీసుకోవాలని కూడా ప్రభుత్వానికి సూచించారు. ఆస్పత్రిలో చంపేస్తామని బెదిరిస్తే.. ఇంట్లో వాళ్లు కూడా భయపడ్డారని, తమకు వందల ఎకరాల పొలాలు ఉన్నాయని, అవి చూసుకోవడానికి సమయం సరిపోవడం లేదు. అలాంటిది రాజకీయాలతో నాకు పనేంటి?, రాజకీయమంటేనే అసహ్యం. ఉద్యోగమే నాకు ముఖ్యం'' అని డాక్టర్ సుధాకర్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications