జనసేనలో కీలక నియామకాలు, పవన్ మార్క్ ఎంపిక..!!
ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కూటమిలో భాగస్వాములుగా కొనసాగుతూనే సొంతం గా బలం పెంచుకోవటం పైన పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా పార్టీ బలోపేతం పైన కీలక మంత్రాంగం చేస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీలో కీలక నియామకాల పైన నిర్ణయం తీసుకున్నారు. కూటమిలో పొత్తు ధర్మం పాటిస్తూనే.. నామినేటెడ్ పదవులు... ఇతర వ్యవహారాల్లోనూ అనుసరించాల్సిన వైఖరి పై స్పష్టత ఇచ్చారు.
జనసేనాని పవన్ కీలక దిశా నిర్దేశం చేసారు. గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అభివృద్ధి కార్యక్రమాల్లో జనసేన నేతలు, కార్యకర్తలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బుధవారం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో పవన్ భేటీ అయ్యారు. తమ ప్రాంత అభివృద్ధి, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో క్రియాశీలకంగా వ్యవహరించేలా పార్టీ శ్రేణులను ముందుకు తీసుకెళ్దామని దిశానిర్దేశం చేశారు.

జనసేన కమిటీల నిర్మాణంలో భాగంగా గ్రామస్థాయిలో ఐదుగురితో కమిటీని నియమించాలని కోరారు. గ్రామ అభివృద్ధిలో భాగమయ్యేలా చేద్దామని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలకు ఐదుగురు చొప్పున సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. నామినేటెడ్ పదవులపై సమీక్షించారు.
రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు జనసేన పొందిన పదవుల వివరాలను పరిశీలించారు. మిగిలిన పదవుల భర్తీపై పలు సూచనలు చేశారు. కూటమి ధర్మాన్ని అనుసరించి ముందుకు వెళ్లడంతో పాటు పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసిన వారికి వివిధ దశల్లో గుర్తింపు, బాధ్యతలు అందించేలా ప్రయాణిస్తున్నామని తెలిపారు. పార్టీ అంతర్గత వ్యవహారాలకు సంబంధించి నెలకొనే అంశాలను పరిష్కరించేందుకు ఉద్దేశించిన కాన్‌ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్ విభాగాన్ని కేంద్ర కార్యాలయం నుంచి పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
ఈ విభాగంలో 11 మంది వరకు సభ్యులను నియమించాలని నిర్ణయించారు. ప్రతి కమిటీలో మహిళలకు స్థానం కల్పించాలని పేర్కొన్నారు. ఐదుగురు సభ్యులు ఉండే కమిటీలో తప్పనిసరిగా ఒకరు, గరిష్ఠంగా ఇద్దరు వీర మహిళలు సభ్యులుగా ఉండాలని తెలిపారు. 11 మంది సభ్యులు ఉండే కమిటీలో ముగ్గురు వీర మహిళలకు స్థానం కల్పించాలని నిర్దేశించారు.












Click it and Unblock the Notifications