Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హోదా కోసం ఆత్మబలిదానం:రామమునికోటి నీ త్యాగం మరవలేం: శైలజానాథ్

మా తెలుగుతల్లి కి మంగళారతులంటూ 2014 లో అవతరించిన నూతన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి (ప్రత్యేక హోదా, విభజిత హామీలు)కి అడ్డుతెరకప్పి దోబూచులాడిన ప్రభుత్వాల మోసపూరిత వాగ్ధానాలకు వ్యతిరేకంగా ఎంత పోరాడినా దక్కని ఫలితం. ఉద్యమ స్పూర్తితో పోరాటపటిమ ప్రదర్శించినను అణువణువునా తిరస్కరణే. విసిగివేశారిన ఆ ఉద్యమకారుడి మాటల ద్వారా మౌనంగా, చేతల ద్వారా నిస్తేజముగా నిస్సహాయకుడిగా మిగిలిపోయాడు. "మా తెలుగు తల్లికి మల్లెపూదండ" తో అలంకరిచాలనే వాంఛ నెరవేరదనే తపనతో అనునిత్యం మదనపడుతూ, వీరోచితంగా పోరాడి స్వచ్ఛందంగా ఆత్మ బలిదానానికి కూడా వెనుకాడని ఆ నిస్వార్థ అమరవీరుడే మన కీ.శే. రామ మునికోటి.

నాటి పొట్టి శ్రీరాములు స్పూర్తితో, నేడు తన ఆత్మబలిదానానికైనా ప్రభుత్వాలు స్పందించి రావణకాష్టంలా తగలబడుతున్న ఆంధ్ర రాష్ట్రం పై వరాల (ప్రత్యేక హోదా మరియు విభజిత అంశాలు) జల్లులతో శాంతిపజేస్తారని ఆశించిన మునికోటికి నిరాశే ఎదురైంది. ఇక తన జీవితాన్నే తృణఫలంగా పెట్టి రాబోవు తరాల వారి భవిష్యత్ బాగుండాలనే ఉద్దేశంతో వెలకట్టలేని ప్రాణత్యాగం చేసాడు.

Ex Minister Sailajanath Remembers Ramamuni Koti A Heartfelt Tribute to a Martyr for AP s Special Status

కలియుగ దైవం వెంకన్నస్వామి వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి పట్టణం లో మంచాల వీథి, టీ.నగర్‌ కాలనీకి చెందిన మునికోటి కి తల్లి తండ్రులు లేని కారణంగా చిన్ననాటి నుండి తన తాతయ్య సహచరుడిగా సేవా, ఆధ్యాత్మిక స్పూర్తిని గమనిస్తూ నలుగురికి సహాయం చేస్తూ, ప్రజా పోరాటాల్లో తన వంతు పోరాడేవాడు, పేద ప్రజలకు అనునిత్యం అండగావుండే వాడు. కరుడుకట్టిన కాంగ్రెస్ కార్యకర్తగా తిరుపతి పురవీధుల్లో అందరికీ సుపరిచితుడు. మరో విశేషమేమంటే సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రతిరోజు ప్రతి పోరాటంలో చురుగ్గా పాల్గొనేవాడు. మునికోటి పోరాటం చూస్తే నాటి "జై ఆంధ్ర" ఉద్యమ పోరాట స్ఫూర్తి కనబడుతుంది. ప్రజా కార్యక్రమాలలో నిరంతరం పాల్గొనేవాడు. గతంలో రామకోటి తాతయ్య కుంట గంగమ్మ ఆలయంలో ఓ కమిటీ సభ్యునిగా కూడా పనిచేశారు.

మునికోటి ఉద్యమాలే ఊపిరిగా బ్రతికాడు. నాడు సమైక్యాంధ్ర కోసం అలుపెరగకుండా ఉద్యమించాడు. కానీ విభజనంతరం నూతన ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం, పార్లమెంట్ సాక్షిగా నాటి ప్రధాని రాష్ట్రానికి ప్రత్యేక హోదా మరియు విభజిత అంశాలను కేటాయించడం వలన అభివృద్ధి చెందుతుందని గ్రహించాడు. కానీ కేంద్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రత్యేక హోదా మరియు విభజిత అంశాలు రాష్ట్రానికి కేటాయించనందువలన ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయమే జరిగిందని, అన్ని రకాల మానవాభివృద్ధి సూచికల్లోనూ అట్టడుగుకు చేరిందని, ఆర్థిక లోటుతో ఇబ్బందులను ఎదుర్కొంటోందని, ఎపికి ప్రత్యేక హోదా దక్కాల్సిందేనని, లేకపోతే ఇక్కడి ప్రజల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని, ఇంతటి కీలకమైన అంశంపై రాజకీయ పార్టీలు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉండి రాజకీయాలకే పరిమితమవుతున్నాయని మునికోటి ఆవేదన వ్యక్తం చేసేవాడు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా చెప్పిన తర్వాతే రాష్ట్రాన్ని విభజించారని, అవి నెరవేర్చాలని, లేదంటే తను ఏదో ఒక బలమైన నిర్ణయం తీసుకుంటానని మునికోటి తన స్నేహితుల వద్ద పదే పదే చెప్పేవాడని తెలియజేసారు.

నాడు ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా మరియు విభజన హామీల కోసం సాగుతున్న ఆందోళనలు తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తోన్నాయి. ప్రత్యేక హోదా ఉద్యమ కార్యక్రమాలను మునికోటి ముందుండి నడిపేవాడు. ఎక్కడికి వెళ్లినా...ఏ పని చేస్తున్నా రాష్ట్రానికి రావాలిసిన హామీలపైనే ధ్యాస. ప్రత్యేక హోదా అతడి ఊతపదమైంది. ఈ క్రమంలో ప్రత్యేక హోదా, హామీల కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పోరాటాలపై ప్రజా సంఘాల ఉద్యమ కారులపై ప్రభుత్వం దమనకాండ, అరెస్టులను చూసి మునికోటి తట్టుకోలేక పోయాడు. ఆ ఉద్వేగంతో, కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో తన ఆత్మ త్యాగం తర్వాతైనా మొండి ప్రభుత్వాలలో చలనం తీసుకు రావాలని కోరుతూ ఆత్మాహుతికి యత్నించాడు. 2015 ఆగస్ట్ 8 శనివారం నాడు తిరుపతి లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ "పోరు సభ" లో అందరూ చూస్తుండగా క్షణాల్లో మునికోటి వంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

ఉద్యమ జ్వాలను రగిల్చి అగ్నికి ఆహుతి అవుతూ ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు అంటూ నినదించాడు. ఆగాథంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలని వేడుకున్నాడు. 70 శాతం కాలిన గాయాలతో ఉన్న మునికోటిని హుటాహుటిన తమిళనాడు లోని వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ హాస్పిటల్ కి తరలించారు. తదనంతరం ఆదివారం తెల్లవారుజామున మెరుగైన వైద్యం కోసం చెన్నై లోని కిల్ పాక్ మెడికల్ కాలేజ్ కి తరలించారు. అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆగస్ట్ 9, 2015 ఆదివారం నాడు మధ్యాహ్నం సమయంలో 40 సంవత్సరాల వయస్సులో మునికోటి తుదిశ్వాస విడిచాడు. మత్యువుతో పోరాడుతూ కూడా "ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు" అంటూ స్మరణ చేశాడు. ఎగిసే మంటల్లో బూడిదవుతుంటే టీవీల్లో మరియు ప్రత్యేక్షంగా చూసిన ఐదుకోట్ల మంది దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజల గుండెలు రగిలాయి. ప్రతి ఒక్కరూ ఉద్యమానికి ఉద్యుక్తులయ్యేలా మునికోటి ఉద్యమజ్వాల రగిలించాడు. ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగం చేసి అమరుడైన మునికోటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి గుండెల్లో త్యాగానికి ప్రతి రూపంగా శాశ్వతంగా నిలిచిపోయాడు.

మునికోటి ఆశయాలను సాధించాలంటే, అన్నీ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మరియు ప్రజలందరూ కలిసికట్టుగా పోరాడి పార్లమెంట్ సాక్షిగా రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదా, విభజన హామీలను సాదించగలిగిన రోజే మునికోటి కి మనమిచ్చే నిజమైన నివాళి.........

జోహార్లు మునికోటి......
నీ త్యాగం మరువలేనిది......
నీ ఆశయం వెలకట్టలేనిది......

ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు
విభజిత హామీలు - ఆంధ్రుల వరాలు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+