భూవివాదం: మారణాయుధాలతో దాడి, సిపిఎం నేతకు తీవ్ర గాయాలు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలోని రాజుపాలెం మండలం దేవరంపాడులో భూవివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.. భూపోరాటం చేస్తున్న సిపిఎఁ నేతలపై కొంతమంది రైతులు దాడి తెగబడ్డారు. ఈ ఘటనలో రాజుపాలెం సీపీఎం కార్యదర్శి ఆంజనేయులు నాయక్ సహా ముగ్గురు సీపీఎం నేతలు తీవ్రంగా గాయపడ్డారు. 35 ఏళ్ల క్రితం దేవరంపాడులో దళితుల కోసం ప్రభుత్వం భూమిని ఇచ్చింది.
నకిరికల్ మండలం దుళ్లపల్లికి చెందిన ఓ బడా రైతు ఈ భూమిని ప్రభుత్వం తనకు కేటాయించిందంటూ ఆక్రమించుకున్నాడు. దీంతో గత కొంతకాలంగా సిపిఎ నేతలు దళిత రైతుకు మద్దతుగా నిలిచి పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్న ఆ బడా రైతు ఈ భూమి తనకే చెందుతుందంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో గురువారం దేవరంపాడు పొలాల్లో రాజుపాలెం సీపీఎం మండలం పార్టీ నేతలు ఆందోళనకు దిగారు.

దీంతో రైతుకు సంబంధించిన కొందమంది పార్టీ నేతలపై మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో రాజుపాలెం మండలం సీపీఎం కార్యదర్శి ఆంజనేయులు తలపై గొడ్డలి వేటు పడటంతో అతని పరిస్థితి విషమంగా ఉంది. ఆయనతో పాటు లక్ష్మణ్‌రెడ్డి, మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని హుటాహుటిన సత్తెన్నపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనను జిల్లా సీపీఎం పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేతలను పార్టీ నేతలు పరామర్శించారు. తమపై దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలంటూ సత్తెనపల్లిలో పార్టీ నేతలు రాస్తారోకో నిర్వహించారు.
వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. సాయంత్రంలోపు ఈ దాడికి చెందిన వారిని అదుపులోకి తీసుకుంటామని పిడుగురాళ్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మీడియాకు తెలియజేశారు. ఈ ఘటనతో దేవరంపాడులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.












Click it and Unblock the Notifications