బాబుXకేసీఆర్: అందుకే తెగేదాకావద్దని ఇద్దరికీ పవన్ కళ్యాణ్! ఫ్యాన్స్ హ్యాపీ
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌ల గొడవ పైన జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు స్పందించారు. ఇది ఆయన అభిమానులకు, జనసేన పార్టీ కార్యకర్తలకు ఆనందాన్నిస్తోంది!
సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్... చంద్రబాబు వర్సెస్ కేసీఆర్ గొడవ పైన ఎందుకు స్పందించడం లేదని టీఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు నిన్నటి వరకు ప్రశ్నించాయి. ఇప్పుడు పవన్ తన మౌనాన్ని వీడారు.
అయితే, పవన్ కళ్యాణ్ స్పందన పైన చర్చ సాగుతోంది. ఆయన సరిగానే స్పందించారా లేదా అనే చర్చ సాగుతోంది.
విభేదాలను తెగే వరకు లాగవద్దని, ఇంకా ఈ నాయకులు తెగేదాకా లాగే స్థాయికి వెళ్తే వారిని అధికారంలో కూర్చోబెట్టిన ప్రజలే ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని, అందరూ ఇది అర్థం చేసుకోవాలని పవన్ ట్విట్టర్‌లో కోరారు.

మన నాయకులు కొందరు రాజకీయాలంటే ప్రతీకారం తీర్చుకోవడమే అనుకుంటున్నారని, నెల్సన్ మండేలాను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. మండేలా ప్రతీకారం తీర్చుకునే పద్ధతిని అవలంభిస్తే తనను, నల్లజాతియులను దశాబ్దాల పాటు అణచివేసి, అవమానాలకు గురి చేసిన వారిని ఏం చేసి ఉండేవారో తేలిగ్గానే ఊహించవచ్చన్నారు.
మండేలా ఒక నాయకుడిగా సఖ్యత, ఐక్యత పంథాను ఎంచుకున్నారని, ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తారని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ వరుసగా ఆరు ట్వీట్లు చేశారు. దీనిపై చర్చ సాగుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రధానంగా టీడీపీని టార్గెట్ చేసుకున్నారనే విషయం వేరేగా చెప్పనవసరం లేదని గుర్తు చేస్తున్నారు. తద్వారా కేసీఆర్ చంద్రబాబు పైన ప్రతీకారం తీర్చుకుంటున్నారనే వారు లేకపోలేదు. చంద్రబాబు పైన కక్షపూరితంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఏపీ మంత్రులు మండిపడుతున్నారు.
తెలంగాణలో టీడీపీకి మంచి క్యాడర్ ఉంది. దానిని దెబ్బతీయాలన్న వ్యూహాంతోనే కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని, అందులో భాగంగా ప్రధానంగా టీడీపీ నేతలనే టార్గెట్ చేసుకుంటున్నారని చెబుతున్నారు. దీనికి తోడు చంద్రబాబు పైన కక్ష తీర్చుకుంటున్నారని చెబుతున్నారు.
నిన్నటి వరకు టీడీపీలో ఉండి, కనీసం... ఆ పార్టీ నుండి గెలిచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటికీ నిర్ణయం వెలువడాల్సి ఉన్న తలసాని వంటి నేతలకు కేబినెట్లో చోటు కల్పించారు. టీడీపీని టార్గెట్ చేసుకోవడం వెనుక.. తమ బలాన్ని పెంచుకోవడం, చంద్రబాబును దెబ్బతీయడమనే కక్షతో కేసీఆర్ వెళ్తున్నారని ఆరోపిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి పైన కుట్రపూరితంగానే వ్యవహరించారని ఆరోపిస్తున్నారు.
మరోవైపు, చంద్రబాబు దెబ్బకు దెబ్బ అన్నట్లు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకు వచ్చారు. ఓటుకు నోటు కేసు నుండి తప్పించుకునేందుకు చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 అంశాలను బయటకు తీసుకు వచ్చారని విపక్షాలు అంటున్నాయి.
ఓటుకు నోటు కేసును కుట్రపూరితంగా తమ పైకి ప్రయోగించారని ఏపీ టీడీపీ నేతలు, తెలంగాణ టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కౌంటర్‌గా చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారు.
ఇలా దెబ్బకు దెబ్బ అన్నట్లు ఇరువర్గాలు వ్యవహరిస్తున్నాయని, అందుకే పవన్ కళ్యాణ్.. తెగేదాకా లాగవద్దని ఇరువురికీ సూచించారని చెబుతున్నారు. ఇప్పటికే విపక్షాలు.. ఇరువురు సీఎంలు ప్రజా సంక్షేమం పక్కన పెట్టారని విమర్శలు గుప్పిస్తున్నాయి.












Click it and Unblock the Notifications