శ్రీశైలంలో ఐదు రోజులపాటు క్రోధినామ ఉగాది మహోత్సవాలు: వేసవి దృష్ట్యా ఏర్పాట్లు!!
తెలుగు వారంతా ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న క్రోధి నామ ఉగాది సంవత్సరం రానే వచ్చింది. ఏప్రిల్ 9వ తేదీన క్రోధి నామ ఉగాదితో తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అనేక ఆలయాలలో ఉగాది మహోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలను ప్రతి సంవత్సరం వైభవోపేతంగా నిర్వహిస్తారు.
శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు
శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఈనెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఐదు రోజుల పాటు క్రోధి నామ ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఈ మేరకు భారీగా వచ్చే భక్తుల కోసం దృష్టిలో పెట్టుకొని చలువ పందిళ్ళు వేయిస్తున్నారు.

పాదయాత్ర భక్తుల కోసం ఏర్పాట్లు
పాదయాత్ర ద్వారా కూడా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు అనేకచోట్ల విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు వచ్చే బాటలో దామర్ల గుంట, వెంకటాపురం, నాగులూటి, పెద్ద చెరువు, కైలాస ద్వారం తదితర ప్రాంతాలలో కూడా చలువ పందిళ్ళు వేస్తున్నారు.
వేసవి కారణంగా సేద దీరేందుకు చలువ పందిళ్ళు
శ్రీశైలం వచ్చే భక్తులు సేద తీరడానికి వీలుగా టోల్గేట్ల వద్ద గల బసవ వనం లోను, సిబ్బంది వసతి గృహాల వద్ద గల బాల గణేశ వనం లోను, పాతాళగంగ మార్గంలోని శివదీక్ష శిబిరాల వద్ద, శివాజీ గోపురానికి ఎదురుగా ఉన్న శివాజీ వనం లోను, దక్షిణ వాడ వీధిలోని రుద్రాక్ష వనం లోను, ఆలయ పుష్కరిణి వద్ద గల శ్రీ పర్వత వనం లోను చలువ పందిళ్ళు వేశారు.
ఉగాది మహోత్సవాలపై సమీక్ష
ఇదిలా ఉంటే ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టరేట్లో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించే ఉగాది మహోత్సవాల ఏర్పాట్లపై జిల్లాఅధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు నంద్యాల జిల్లా కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు . జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో వున్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ఉగాది మహోత్సవాలు చేసుకోవాలన్నారు.

భక్తుల కోసం మెడికల్ క్యాంపులు
వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో కర్ణాటక నుండి వచ్చే కన్నడ భక్తులు వదెబ్బకు గురి కాకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వెంకటాపురం నుంచి శ్రీశైలం వరకు వచ్చే పాదయాత్ర భక్తులకు అటవీ మార్గంలో గుర్తించిన మార్గమద్యములో 13 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ప్రధానంగా ఫోకస్ చెయ్యాల్సిన అంశాలివే .. కలెక్టర్ సూచన
ఎక్కడ చెత్తా చెదారం వుండకుండా పారిశుద్ధ్య పనులను 24 గంటల పాటు మూడు షిఫ్టులలో పనిచేసేలా చర్యలు తీసుకుకోవాలని డీపిఓను ఆదేశించారు. ప్రధానంగా తాగునీరు, పారిశుద్ధ్యం,పార్కింగ్ ప్రదేశాలు, భక్తుల దర్శన క్యూలైన్లు, లడ్డు ప్రసాద కౌంటర్లు తదితరాలపై దృష్టి సారించి ఆ మేరకు చర్యలు తీసుకోవాలని శ్రీశైలం దేవస్థానం అధికారులకు సూచించారు.












Click it and Unblock the Notifications