మెగాస్టార్‌ను కలిసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
అమరావతి: సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన కుమార్తె ప్రియాంక త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ప్రస్తుతం పెళ్లి పనుల్లో తీరిక లేకండా గడుపుతున్నారు. సన్నిహితులు, బంధుమిత్రులను కలిసి వివాహ శుభలేఖను అందించే కార్యక్రమాల్లో ఉన్నారు.
ఇందులో భాగంగా- లక్ష్మీనారాయణ.. మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. తన భార్య ఊర్మిళతో కలిసి హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 25లోని మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. చిరంజీవి ఆయన భార్య సురేఖకు వివాహ శుభలేఖను అందజేశారు. ప్రియాంక పెళ్లికి రావాలంటూ ఆహ్వానించారు. దీనికి మెగాస్టార్ దంపతులు సానుకూలంగా స్పందించారు.

లక్ష్మీనారాయణ ఇదివరకే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. సుమారు మూడు లక్షల ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు. ఆ తరువాత రాజకీయాల్లో పెద్దగా క్రియాశీలకంగా లేరు. జనసేన నుంచి కూడా బయటికి వచ్చారు.
సామాజిక కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటోన్నారు లక్ష్మీనారాయణ. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించారు కూడా. క్రౌడ్ పుల్లింగ్ ద్వారా నిధులను సమీకరించి- ఈ ప్లాంట్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్‌లో సైతం పాల్గొన్నారు. తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీకగా భావించే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడ్డుపడాలంటూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు పలు సూచనలూ చేశారాయన.
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే 2,000 రూపాయల నోట్లను రద్దు చేయడాన్ని స్వాగతించారు. సకాలంలో రిజర్వు బ్యాంక్ ఈ చర్య తీసుకుందని, ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని తగ్గించాలన్నది తన ప్రధానమైన డిమాండ్ అంటూ పేర్కొన్నారు. ఇంతకుముందు పెద్ద నోట్ల రద్దు అనుభవం ఉన్న నేపథ్యంలో- ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications