తెరపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం..!!
రాష్ట్రంలో శాసన మండలి ఎన్నికల పోలింగ్ సోమవారం జరుగనుంది. దీనికి- రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
అమరావతి: రాష్ట్రంలో పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గాలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. 16వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. పట్టభద్రులు-3, ఉపాధ్యాయులు- 2, స్థానిక సంస్థల కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఎన్నుకోనున్నారు ఓటర్లు. ఇప్పటికే అయిదు స్థానిక సంస్థల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పోలింగ్ సందర్భంగా తిరుపతిలో భారీగా బోగస్ ఓట్లు నమోదయ్యాయంటూ ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. నకిలీ ఓట్లు పెద్ద సంఖ్యలో పోల్ అయ్యాయంటూ తెలుగుదేశం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, భారతీయ జనతా పార్టీ చీఫ్ సోము వీర్రాజు, వామపక్ష నేతలు.. విమర్శించారు. కొన్ని కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలంటూ వారు డిమాండ్ చేశారు.

క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితాలను పరిశీలించినప్పుడు బోగస్ ఓటర్ల వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు ఆరోపించారు. తిరుపతి నెహ్రూ నగర్ లోని వైసీపీ కార్యాలయ అడ్రస్ మీద 30 మంది నకిలీ గ్రాడ్యుయేట్ ఓటర్లు ఓటు వేశారంటూ విమర్శించారు. ఖాళీ స్థలాల్లో గ్రాడ్యుయేట్ ఓటర్లు నివసిస్తున్నట్లు నకిలీ అడ్రస్ లను వైసీపీ నాయకులు సృష్టించారని మండిపడ్డారు. అనంతపురంలో ఇదే పరిస్థితి తలెత్తినట్లు విమర్శించారు.
దీనిపై తాజాగా రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పందించారు. ఏపీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గాల పోలింగ్ ప్రక్రియ మొత్తం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందని విమర్శించారు. 10వ తరగతి కూడా చదవని వారిని పట్టభద్ర ఓటర్లుగా ఓటు హక్కు కల్పించిన విషయం తన దృష్టికి వచ్చిందని అన్నారు. దీనిపై టీవీ ఛానళ్లల్లో కథనాలు కూడా ప్రసారం అయ్యాయని గుర్తు చేశారు.

అయినప్పటికీ.. అలాంటి చోట రీపోలింగ్ కు ఆదేశించకపోవడంపై తనను ఆశ్చర్యాన్యికి గురి చేసిందని ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. ఆయా పార్టీలు రీపోలింగ్ కు డిమాండ్ చేసినప్పటికీ ఎన్నికల కమిషన్ స్పందించకపోవడం సరికాదని అన్నారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనాకు లేఖ రాశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ ఒక ప్రహసనంగా ముగిసిందంటూ ఎల్వీ సుబ్రహ్మణ్యం విమర్శించారు. బోగస్ ఓట్లను నమోదు చేస్తున్నట్టు ఆధారాలు కనిపిస్తున్నా, చర్యలు తీసుకోకుండా ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. బోగస్ ఓట్లు, ఎన్నికల నిర్వహణ అవకతవకలపై తక్షణమే విచారణ జరిపించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications