వైసీపీలో చేరిన జనసేన బిగ్ ఫిష్
అమరావతి: తెలుగుదేశం పార్టీతో కుదుర్చుకున్న పొత్తు జనసేన పార్టీలో అంతర్గతంగా చిచ్చు రేపింది. పార్టీ సీనియర్ నాయకులు సైతం తమ నియోజకవర్గాల పరిధిలో టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాల్సిన పరిస్థితి రావడంతో ఒక్కొక్కరు దూరమౌతోన్నారు. జనసేనకు గుడ్‌బై చెబుతున్నారు.
ఇదివరకే నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ కేతంరెడ్డి వినోద్ రెడ్డి.. పార్టీకి గుడ్‌బై చెప్పారు. అనంతరం ఆయన వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆ పరంపర కొనసాగుతోంది.నియోజకవర్గ పరిధిలో టీడీపీ- జనసేన మధ్య ఇటీవలే ముగిసిన ఆత్మీయ సమావేశాలు సైతం రసాభసగా మారాయి. జనసేన బలంగా ఉందని భావిస్తోన్న ఉమ్మడి- ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఒకరినొకరు తోసుకున్నారు.. తన్నుకున్నారు.

ఇప్పుడు అదే గోదావరి జిల్లాలకు చెందిన మరో సీనియర్ నేత వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు పలువురు జనసేన నాయకులు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఆయనే- మేడా గురుదత్త ప్రసాద్. జనసేన పార్టీ సీనియర్ నాయకుడు నాగబాబుకు సమీప బంధువు. గతంలో తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గానికి ఇన్‌ఛార్జీగా వ్యవహరించారు. టీడీపీతో పొత్తు కుదుర్చుకుంటున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ప్రకటించిన కొద్దిరోజుల్లోనే గురుదత్త ప్రసాద్.. పార్టీకి గుడ్‌బై చెప్పారు.

తాజాగా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకొన్నారు. గురుదత్త ప్రసాద్‌తో పాటు ఆయన అనుచరులు మండపాక శ్రీను, అడబాల సత్యనారాయణ, వడ్డి చిన్నా, నాగవరపు భానుశంకర్, వల్లేపల్లి రాజేష్, చొంగా మణికంఠ.. వైసీపీలో చేరారు. వారివెంట సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఉన్నారు.












Click it and Unblock the Notifications