విజయవాడ రచ్చ రచ్చ: వైసీపీలోకి పోతిన
Pothina Mahesh: ఊహించినట్టే- విజయవాడకు చెందిన జనసేన సీనియర్ నాయకుడు పోతిన మహేష్.. పార్టీకి రాజీనామా చేశారు. జనసేనలో సుదీర్ఘకాలం నుంచి పని చేస్తూ వస్తోన్నారాయన. ఈ ఎన్నికల్లో విజయవాడ పశ్చిమం నియోజకవర్గం టికెట్‌ను ఆశించారు. 2019లోనూ ఆయన ఇదే స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు.
పొత్తులో భాగంగా ఈ సీటును భారతీయ జనతా పార్టీ దక్కించుకుంది. కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి ఇక్కడి నుంచి టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు. తనకు టికెట్ దక్కకపోవడంతో పోతిన మహేష్.. జనసేనకు రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు పంపించారు.

ఇక ఆయన అడుగులు ఎటు వైపు పడొచ్చనే అంశంపై విజయవాడ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. తొలుత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతారంటూ ఆయన అనుచరులు వెల్లడించారు.
రాజీనామా అనంతరం పోతిన మహేష్ ప్రెస్ మీట్ సందర్భంగా కొత్త ప్రచారం తెర మీదికి వచ్చింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. సిట్టింగ్ ఎంపీ, వైఎస్ఆర్సీపీకి చెందిన విజయవాడ లోక్‌సభ అభ్యర్థి కేశినేని నాని ఈ మేరకు ఆయనతో సంప్రదింపులు జరిపినట్లు చెబుతున్నారు.
ఇదివరకు జనసేనకే చెందిన ముమ్మిడివరం, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు పితాని బాలకృష్ణ, శెట్టిబత్తుల రాజాబాబు కూడా పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకొన్న విషయం తెలిసిందే.
అదే తరహాలో పోతిన మహేష్ కూడా వైఎస్ఆర్సీపీ చేరుతారని తెలుస్తోంది. వైఎస్ జగన్ నిర్వహిస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవాడలో అడుగు పెట్టిన తరువాత లేదా ఉగాది పర్వదినం నాడు రోజున ఆయన సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకొంటారని అంటున్నారు.
కాగా- పోతిన మహేష్ రాజీనామా చేసిన వెంటనే ఆయన అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున విజయవాడ వెస్ట్ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, ఇతర నాయకుల ఫొటోలను ముద్రించివున్న ఫ్లెక్సీలను తగులబెట్టారు. పవన్ కల్యాణ్, టీడీపీ కూటమికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications