ఎన్నికలు దగ్గరలోనే; జగన్ తో విజయమ్మ, షర్మిల జాగ్రత్త: షాకిచ్చిన మాజీ మంత్రి జవహర్
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. వైఎస్ కుటుంబానికి చెందిన వారు ఈ హత్యకు పాల్పడ్డారని, వైయస్ వివేకానంద రెడ్డి హత్య గురించి జగన్ కు ముందే తెలుసని, హత్య కేసు నిందితులను సీఎం జగన్ కాపాడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదే క్రమంలో సిబిఐకి వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో ఉన్న విషయాలు రాజకీయంగా మరింత దుమారం రేపాయి. దీంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి, వైయస్ కుటుంబ సభ్యులపై ప్రతిపక్షాల విమర్శలు మరింత పెరిగాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో జగన్ ను టార్గెట్ చేశారు. వివేకా హత్యకేసులో జగన్ పూర్తిగా కూరుకుపోయారని పేర్కొన్నారు.

జగన్ సూత్రధారి.. ఆయనను విచారించండి
టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కేఎస్ జవహర్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. సొంత బాబాయిని అతి కిరాతకంగా హతమార్చిన దోషులు ఎవరో తెలిసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎందుకు దోబూచులాట ఆడుతున్నారో చెప్పాలని మాజీ మంత్రి జవహర్ ప్రశ్నించారు. ఈ హత్యకు ప్రధాన సూత్రధారి అంటూ వైయస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన ఆయన, జగన్ ను విచారిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు.

అధికారం కోసమే వైఎస్ జగన్ ఈ రక్త చరిత్ర వాడుకున్నారు
ఈ రక్త చరిత్ర కు దర్శకుడు జగన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసమే వైఎస్ జగన్ ఈ రక్త చరిత్ర వాడుకున్నారని మాజీ మంత్రి ఆరోపణలు గుప్పించారు. హత్య రాజకీయాలు జగన్ కు కొత్త కాదని, మొద్దు శీను హత్య కూడా జగన్ కనుసన్నల్లోనే జరిగిందని జవహర్ పేర్కొన్నారు. చరిత్రలో తండ్రిని చంపి అధికారంలోకి వచ్చిన వారు ఉన్నారని, అటువంటి వాళ్ల జాబితాలో జగన్ ఒకరు అంటూ జవహర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

విజయమ్మ, షర్మిల జాగ్రత్త .. మాజీ మంత్రి సూచన
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జగన్ కు తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల దూరంగా ఉంటే మంచిదని మాజీ మంత్రి జవహర్ సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఎవరిని బలి చేయబోతున్నారో చెప్పాలని జవహర్ జగన్ ను నిలదీశారు. వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో అలసత్వం వహించిన గత డీజీపీ గౌతమ్ సవాంగ్ పైన చర్యలు తీసుకోవాలని జవహర్ సూచించారు.
Recommended Video

గౌతమ్ సవాంగ్ పేరు కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చాలి
నేరం ఎవరు చేశారో తెలిసికూడా గత డీజీపీ గౌతమ్ సవాంగ్, చట్టాన్ని జగన్ చుట్టంగా మార్చారని మండిపడ్డారు. గౌతమ్ సవాంగ్ పేరు కూడా ఎఫ్ఐఆర్లో చేర్చాలి అని మాజీ మంత్రి జవహర్ డిమాండ్ చేశారు. ఏ వాంగ్మూలం చూసినా వివేకానంద రెడ్డి హత్య కేసులో వైయస్ జగన్ ప్రమేయం ఉందని అర్థమవుతుందని టిడిపి సీనియర్ నాయకుడు మంత్రి జవహర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications