టీడీపీ నేత బండారు అరెస్ట్- సీఎం జగన్, రోజాను తిట్టిన కేసులు-గుంటూరుకు..
ఏపీలో టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణను పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. సీఎం వైఎస్ జగన్ తో పాటు మంత్రి ఆర్కే రోజాను దూషించిన కేసులో ఆయన్ను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై ఈ మేరకు రెండు కేసులు నమోదు చేశారు. విశాఖలో అదుపులోకి తీసుకున్న బండారును గుంటూరుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బండారు అంతకు ముందే ఏపీ హైకోర్టు లో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీ చేపడుతున్న నిరసనల్లో పాల్గొన్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణ సీఎం వైఎస్ జగన్ తో పాటు మంత్రి ఆర్కే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కాస్తా వివాదాస్పదం కావడంతో మహిళా కమిషన్ స్పందించింది. బండారుపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ నేతలు మహిళా కమిషన్ ను ఆశ్రయించడంతో ఈ ఆదేశాలు ఇచ్చారు. దీంతో గుంటూరు పోలీసులు ఆయనపై రెండు కేసులు నమోదు చేశారు.

అనంతరం నిన్న అర్దరాత్రి బండారును అరెస్టు చేసేందుకు విశాఖలోని ఆయన ఇంటికి వెళ్లారు. అయితే ఇంట్లోకి మాత్రం వెళ్లలేదు. అలాగే బండారు ఇంటికి టీడీపీ నేతల్ని కూడా అనుమతించలేదు. దీంతో దాదాపు 15 గంటల పాటు ఉత్కంఠ కొనసాగింది. బండారును ఇంట్లోనుంచి రానివ్వకుండా పోలీసులు అడ్డుకోవడం, ఇతర ఆంక్షలపై ఆయన భార్య మాధవీలత పోలీసుల్ని ఆశ్రయించి కేసు పెట్టారు.
బండారును ఏ క్షణంలో అయినా అరెస్టు చేసేందుకు వీలుగా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. చివరకు పోలీసులు ఈ సాయంత్రం అరెస్టు చేసి గుంటూరుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. స్ధానిక కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే బండారు హైకోర్టును ఆశ్రయించి బెయిల్ కూడా కోరినట్లు తెలుస్తోంది. కానీ సెలవుదినం కావడంతో ఇవాళ విచారణ జరగలేదు. రేపు ఈ వ్యవహారంపై విచారణ జరిగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications