రాజమండ్రి సెంట్రల్ జైలుకు గోరంట్ల మాధవ్-వరుస ట్విస్ట్ ల తర్వాత రిమాండ్..!
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు అర్ధరాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారు. ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై దాడి కేసులో మాధవ్ తో పాటు మరో ఐదుగురికి గుంటూరు కోర్టు న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో వీరందరినీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే గోరంట్ల మాధవ్ అరెస్టు నుంచి రిమాండ్ వరకూ వరుస ట్విస్టులు చోటు చేసుకున్నాయి.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్ ను పోలీసులు మొన్న అరెస్టు చేసారు. అయితే ఆయన్ను పోలీసు స్టేషన్ కు తరలిస్తుండగా.. మార్గమధ్యలో తన అనుచరులతో కలిసి అడ్డుకున్న వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ దాడికి యత్నించారు. దీంతో ఎలాగోలా చేబ్రోలు కిరణ్ ను కాపాడిన పోలీసులు.. ఈ వ్యవహారంలో గోరంట్ల మాధవ్ తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు.

పోలీసు కస్టడీలో ఉన్న చేబ్రోలు కిరణ్ పై దాడి కేసులో నిందితుడిగా ఉన్న గోరంట్ల మాధవ్ ను నిన్న మీడియా ముందు ప్రవేశపెట్టేందుకు గుంటూరు పోలీసులు సిద్దమయ్యారు. అయితే మాజీ ఎంపీగా ఉన్న తనను క్రిమినల్ గా మీడియా ముందు ఎలా ప్రవేశపెడతారంటూ గోరంట్ల మాధవ్ ఎదురుతిరిగారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో చివరికి ఆయన్ను మీడియా ముందు ప్రవేశపెట్టకుండానే వైద్య పరీక్షలు చేయించి నేరుగా కోర్టుకు తరలించారు.
గుంటూరు కోర్టులో గోరంట్ల మాధవ్ చేబ్రోలు మాధవ్ పై దాడి చేసిన కేసులో పోలీసులు రిమాండ్ కోరారు. దీంతో గుంటూరు కోర్టు న్యాయమూర్తి రెండు వారాల రిమాండ్ విధించారు. అయితే రిమాండ్ పై గోరంట్ల మాధవ్ తో పాటు మరో ఐదుగురిని నెల్లూరు కోర్టుకు తరలించాలని ఆదేశించారు. కానీ అక్కడ ఏర్పాట్లు సరిగా లేవని, అక్కడకు పంపితే ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు జడ్జి దృష్టికి తెచ్చారు. దీంతో న్యాయమూర్తి నెల్లూరు జైలుకు కాకుండా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వీరిని తరలించాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో వీరిని అర్ధరాత్రి రాజమండ్రి జైలుకు తరలించారు.












Click it and Unblock the Notifications