శుభశకునం: జూన్ 6న అమరావతికి శంకుస్థాపన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నగరం ‘అమరావతి'కి జూన్ 6 న శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో మంగళవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
మంత్రివర్గ సమావేశం వివరాలను మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు మీడియా ప్రతినిధుల సమావేశంలో తెలిపారు. కొత్త రాజధానికి శంకుస్థాపన చేసేందుకు జూన్ 5, 6, 8 తేదీలు బాగా ఉన్నాయని పండితులు వివరించారని, ఈ తేదీల్లో శంకుస్థాపన జరగకపోతే మళ్లీ వచ్చే సంవత్సరం మార్చి వరకు మంచిరోజులు లేవని చెప్పారని వారన్నారు.
ఈ కారణంగా జూన్ 6 వ తేదీన శంకుస్థాపనకే మొగ్గు చూపినట్టు మంత్రులు చెప్పారు. ప్రజలకు అనుకూలంగా ఉండేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం వారంలో మూడు రోజుల పాటు అమరావతి ప్రాంతంలో (విజయవాడ-గుంటూరు లేదా ఇతర ప్రాంతం) నడిపించాలని నిర్ణయించామన్నారు.

అలాగే మంత్రులు కూడా తమ క్యాంప్ కార్యాలయాలను వారంలో కొన్ని రోజులైనా కొత్త రాజధాని ప్రాంతంలో నడిపించే విషయంపై పరిశీలన చేయాలని నిర్ణయించారు. అవసరమైన మేరకు భవనాలు లభిస్తాయా లేదా అన్న అంశంపై అధికారులు పరిశీలన చేస్తారన్నారు.
రాష్టస్థ్రాయిలో ప్రధాన శాఖల్లో కొన్నింటినైనా కొత్తరాజధాని ప్రాంతానికి తరలించాలని నిర్ణయించామని, ఈ అంశంపై మంత్రివర్గ ఉపసంఘం అవసరమైన చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ ఉపసంఘం భవనాలను గుర్తించేందుకు అమరావతి ప్రాంతంలో పర్యటిస్తుందన్నారు.
ఉద్యోగులను కొత్త రాజధానికి పంపించేందుకు ప్రత్యేకంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఉద్యోగుల బదిలీలను ఈ నెల 15-30 మధ్య చేయాలని నిర్ణయించామన్నారు. పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన మేరకే బదిలీల ప్రక్రియ చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. బ
దిలీల సందర్భంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎవరూ సిఫారసు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. జూన్ 2 నుండి 7 వరకు నవనిర్మాణ దీక్ష కార్యక్రమం చేపడుతున్నామని, ఎనిమిదో తేదీన భారీగా బహిరంగ సభ నిర్వహించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించామన్నారు.
పరిపాలనలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు ఐదు విధాన నిర్ణయాలను మంత్రివర్గ సమావేశంలో ఆమోదించామని వారు తెలిపారు.
మత్స్యరంగం అభివృద్ధి, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి, ఏజన్సీ ప్రాంతంలో కాఫీ తోటల పెంపకానికి, ఈ-గవర్నెన్స్, టూరిజం అభివృద్ధికి ఒక్కో పాలసీకి ఆమోదం లభించిందని వారు వివరించారు.
అంగన్‌వాడీ ఆయాలు, సిబ్బంది వేతనాలపై పరిశీలన చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసినట్టు పుల్లారావు, అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్ర విభజన జరిగినప్పటికీ, విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్స్‌పై క్లారిటీ లేదని, దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించామన్నారు.
ఆర్టీసి సిబ్బంది సమ్మెపై మంత్రివర్గ సమావేశంలో చర్చించామని, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించామని మంత్రులు తెలిపారు.












Click it and Unblock the Notifications