టిడిపిలోకి మంత్రి గంటా, 4గురు ఎమ్మెల్యేలు?

ఈ నేపథ్యంలోనే బుధవారం మంత్రి గంటా శ్రీనివాసరావు కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు విశాఖపట్నం వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిసేందుకు వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులతోపాటు కోస్తా, ఉత్తరాంధ్రకు చెందిన పలువురు నేతలు క్యూకట్టినట్లు తెలుస్తోంది. విశాఖ చేరుకున్న చంద్రబాబు తొలుత గంటా కుమార్తె వివాహానికి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించిన అనంతరం చంద్రబాబు హోటల్ దసపల్లాకు చేరుకున్నారు. సుమారు రెండున్నర గంటలపాటు చంద్రరాబు హోటల్‌లో ఉన్నారు. ఆ సమయంలో ఆయన్ను కలిసేందుకు పలువురు ప్రముఖులు, నాయకులు భారీగా తరలివచ్చారు.
కాగా గంటా శ్రీనివాసరావుతోపాటు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, గాజువాక ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, భీమునిపట్నం ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు, యలమంచిలి ఎమ్మెల్యే యూవి రమణమూర్తి రాజు (కన్నబాబు) టిడిపిలో చేరనున్నట్లు తెలిసింది. గంటా బృందం రాకపై హోటల్‌లో చంద్రబాబు జిల్లా నేతలతో చాలా సేపు చర్చించినట్లు తెలిసింది. గంటా బృందం వస్తున్న నేపథ్యంలో జిల్లా, నగరంలో టిక్కెట్ల కేటాయింపు, మారనున్న సమీకరణాలపై అధినేత వారితో మాట్లాడినట్లు సమాచారం.
రాష్ట్ర విభజన ప్రకటన తరువాత మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రభుత్వ తీరుపై బాహటంగానే విమర్శిస్తున్న విషయం తెలిసిందే. వేర్వేరు పార్టీల నుంచి తనకు ఆహ్వాలున్నట్లు కూడా ఆయన ఇటీవల ప్రకటించారు. ఇది ఇలా ఉండగా టిడిపిలోకి మంత్రి గంటా వస్తున్నారన్న వార్తలపై మొదటి నుంచి గుర్రుగా ఉన్న ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సిహెచ్ అయ్యన్నపాత్రుడు చంద్రబాబుని ఇటీవల హైదరాబాద్‌లో కలిశారు.
బలమైన సామాజిక వర్గానికి చెందిన గంటాతోపాటు మరో నలుగురు ఎమ్మెల్యేలను చేర్చుకోవడంతో రాబోయే ఎన్నికల్లో పార్టీకి ఉపయోగపడుతుందని చంద్రబాబు.. అయ్యన్నకు సూచించినట్లు తెలిసింది. తీవ్ర తర్జనభర్జనల తరువాత అధినేత చంద్రబాబు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే అయ్యన్న పాత్రుడు బుధవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలో ఎవరైనా.. ఏ పార్టీలోనైనా చేరవచ్చని అన్నారు. టిడిపికి ఘనమైన చరిత్ర ఉందని, అందుకే ఇలాంటి పార్టీలోకి నిజాయితీపరులు వస్తేనే పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావును గౌరవించినట్లు అవుతుందని వ్యాఖ్యానించడం గమనార్హం.












Click it and Unblock the Notifications