సర్వాలంకార భూషితుడై..
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం నాడు 76,501 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 29,033 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.39 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 29 కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 20 నుంచి 22 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్న ప్రసాదం, అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

వ్యాస పౌర్ణమి/గురు పౌర్ణమిని పురస్కరించుకుని తిరుమలలో గురువారం రాత్రి గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. వేలాదిమంది భక్తులు స్వామివారి దర్శించుకున్నారు.
గరుడ వాహన సేవలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో లోకనాథం పాల్గొన్నారు.
ఇదే నెలలో మరోసారి గరుడ వాహనసేవను నిర్వహించబోతోంది టీటీడీ. ఈ నెల 29వ తేదీన గరుడ పంచమి. ఈ పండగను పురస్కరించుకుని.. మరోసారి మలయప్ప స్వామివారు గరుడ వాహనారూఢుడై అశేష భక్తజనులను కరుణిస్తాడు. ఇలా ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి గరుడ సేవను నిర్వహించడం అరుదు.
వీటితో పాటు ఈ నెల 16వ తేదీన శ్రీవారి ఆలయంలో ఆణివారి ఆస్థాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆణివార ఆస్థానానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. 25న చక్రతాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, 28న శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేపు, 30న కల్కి జయంతి, కశ్యప మహర్షి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications