గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలు, సమస్యలేవీ లేవు కదా: సెక్షన్ 8పై కేంద్రం
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో పౌరుల భద్రతని దృష్టిలో ఉంచుకొని విభజన చట్టంలో గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలు కల్పించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. సెక్షన్ 8 (2) ప్రకారం ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలు, అంతర్గత భద్రత, కీలకమైన సంస్థల రక్షణ, ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ, కేటాయింపులపై గవర్నర్‌కు బాధ్యతలను కట్టబెట్టినట్లు తెలిపారు.
తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నలకు ఆయన బుధవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విభజన చట్టం సెక్షన్ 8(1) ప్రకారం పరిపాలనా ఉద్దేశ్యంతో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయిందని, ఈ ప్రాంతంలో నివసించే పౌరుల ప్రాణాలు, స్వేచ్ఛ, ఆస్తుల రక్షణకు గాను గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యతలు కల్పించామని ఆయన చెప్పారు.

అయితే, ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌లో పౌరుల రక్షణ, ఆస్తులకు సంబంధించి ఎలాంటి సమస్యలూ ఏర్పడలేదని వివరించారు. ఈశాన్య రాష్ట్రాలకు అమలులో ఉన్న ప్రత్యేక హోదాను ఉపసంహరించే ప్రతిపాదన ఏదీ కేంద్రం వద్ద లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన తెలిపారు. 14వ ఆర్థిక సంఘం కేటాయింపుల్లో కేంద్ర ఆదాయం నుంచి రాష్ట్రాలకు వాటాను పెంచినందున ప్రత్యేక హోదాకు ప్రాధాన్యత లేదని కేంద్రం ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.
విభజన సందర్భంలో జనాభా ప్రాతిపదికన రెండు రాష్ట్రాలకు ఆస్తుల పంపిణీ చేయడం వల్ల ఏపీకి ఎలాంటి నష్టం వాటిల్లదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హరీభాయ్ చౌధురి రాజ్యసభలో హామీ ఇచ్చారు. పన్నుల బకాయిలను రెండు రాష్ట్రాలకు సమానంగా పంచేలా సెక్షన్లలో మార్పులు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు లేఖ రాశారని ఆయన చెప్పారు. రెవెన్యూ బకాయిలు, రుణాలు, ఇతర పన్నుల వసూళ్ల గురించి రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 50, 51, 56ల్లో స్పష్టంగా పేర్కొన్నట్టు వివరించారు.












Click it and Unblock the Notifications