ఏపీలో ఈ 10 జిల్లాలకు భారీ వర్ష సూచన..!!
అమరావతి: ఏపీకి వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీ విపత్తుల నిర్వహణ విభాగం కూడా ప్రజలను అప్రమత్తం చేసింది. కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షం పడొచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
విపత్తు నిర్వహణ విభాగం ఇచ్చిన సమాచారం ప్రకారం.. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. దీని ప్రభావం వచ్చే 8 గంటల వరకు వరకూ ఉండొచ్చు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తా, మధ్య కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి.

వచ్చే 24 గంటల వ్యవధిలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది.
ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రైతులు.. తమ పొలం పనుల్లో ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు రైతులు, వ్యవసాయ కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండకూడదని హెచ్చరించింది. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
ఈ వర్షాల తీవ్రత 48 గంటల వరకూ కొనసాగే అవకాశాలు లేకపోలేదు. ఉపరితల ఆవర్తనం బలపడటానికి అనుకూల వాతావరణం ఉన్నందున రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.












Click it and Unblock the Notifications