ఏపీపై తీవ్ర అల్పపీడనం ఎఫెక్ట్?
Heavy rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావం వల్ల కొద్దిరోజుల కిందటే ఏపీలో భారీగా వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో దంచికొట్టాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు విస్తారంగా వర్షలు పడ్డాయి. ప్రత్యేకించి- కోస్తాజిల్లాలపై దీని తీవ్రత అధికంగా కనిపించింది. ఇప్పుడు తాజాగా మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ఫలితంగా ఏపీలో మరో విడత విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు లేకపోలేదు.
బంగాళాఖాతం ఈశాన్యప్రాంతం- దానికి ఆనుకుని ఉన్న మయన్మార్ తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తున ఇది విస్తరించి ఉంది. చురుగ్గా కదులుతోంది. ఈ ఆవర్తనం.. మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారడానికి అవసరమైన అనుకూల వాతావరణం నెలకొని ఉంది. ఫలితంగా- వచ్చే 24 గంటల వ్యవధిలో ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

అలాగే- సెప్టెంబర్ రెండో వారంలో కూడా మరో అల్పపీడనం ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభాం వల్ల నేడు విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాల ప్రభావం ఉన్నందున గోదావరి, కృష్ణానదులు ఉప్పొంగుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం 44.4 అడుగులుగా నమోదైంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 11. 91 లక్షల క్యూసెక్కులు ఉంటోంది. ఫలితంగా ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రకాశం బ్యారేజి వద్ద సాయంత్రం 5 గంటలకు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.42 లక్షల క్యూసెక్కులు ఉందని, మొదటి హెచ్చరిక స్థాయి వరకు వరద ప్రవాహం చేరే అవకాశం ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications