ఎడతెరిపి లేని వర్షం, అతలాకుతలం..!!
భారీ వర్షంతో జన జీవనం స్తంభించింది. నగరం మొత్తం వర్షపు నీట మునిగింది. ఎడతెరిపి లేని వర్షంతో సామాన్యులు ఇబ్బంది పడ్డారు. వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతా ల్లో చెరువులు నిండి నేషనల్ హైవే పైకి వరద ప్రవాహం చేరింది. అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో అతలాకుతలమైన నెల్లూరు నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
దిత్వా' తుపాను ప్రభావంతో నెల్లూరులో ఎడతెరిపిలేని వర్షం కురిసింది. వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో నగరంలో జనజీవనం స్థంభించింది. నెల్లూరు జిల్లాలో శివారు కాలనీల్లో ప్రజలు పనులు లేక పస్తులుంటున్నారు.ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గూడూరు వద్ద స్వర్ణముఖి నది నిండుగా ప్రవహిస్తోంది. డ్యాంలు, రిజర్వాయర్లు, చెరువులు నిండుకుండలా ఉన్నాయి. సోమశిల, కండలేరు డ్యాంలకి పైఎత్తు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

పెన్నా, కైవల్య, స్వర్ణముఖి, కాళంగి నదులు, వాగులు, వంకలు, కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పొట్టేపాళెం కలుజు వద్ద మట్టిరోడ్డు కొట్టుకుపోయింది. వాకాడు మండలం కొండూరుపాళెం జలదిగ్భందలో ఉంది. చిల్లకూరు మండలం తిప్పగుంటపాళెం వద్ద ఉప్పుటేరు వాగు ఉధృతంగా పొంగిపొర్లుతోంది. తిప్పగుంటపాళెం జలదిగ్భంధంలో ఉంది. కోట మండలం పుచ్చలపల్లి వద్ద స్వర్ణముఖి నది పొర్లుకట్టలు బలహీనంగా ఉన్నాయి. వరద నీరు రావడంతో దైవాలదిబ్బకి చెందిన కుటుంబా లని సురక్షిత ప్రాంతాలకి తరలించారు.
నెల్లూరు నగర శివారు ప్రాంతాలు జలదిగ్భంధంలో ఉన్నాయి. తిప్పవరప్పాడు వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. గూడూరు - సైదాపురం మధ్య రాకపోకలు నిలిచాయి. సైదాపురం మండలంలో మావిలేరు, పిన్నేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సైదాపురం - పొదలకూరు మధ్య రాకపోకలు కష్టంగా మారాయి. చిల్లకూరు మండలం పాలిచెర్లవారిపాళెం వద్ద రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది. చిల్లకూరు - చింతవరం మధ్య రాకపోకలు స్తంభించాయి.
నెల్లూరులోని పేరారెడ్డిపల్లి, బీసీ కాలనీల్లోని ఇళ్లలోకి వరద చేరింది. సైదాపురం మండలంలో పిన్నేరు వాగు కాజ్‌వేపై వరద ప్రవహిస్తోంది. దీంతో బుధవారం రాత్రి నుంచి సైదాపురం-పొదలకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లూరుతో పాటుగా పొదలకూరు, మనుబోలు, కోవూరు, వెంకటాచలం, ముత్తుకూరు, కొండాపురం మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది.












Click it and Unblock the Notifications