దిశ మారిన అల్పపీడనం- ఈ ప్రాంతాలకు భారీ వర్షాలు..!!
వాతావరణం లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వరుస అల్పపీడనాలతో ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. తాజాగా పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ - నైరుతి దిశగా కదులుతూ దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్తుందని వాతావరణ శాఖ తెలి పింది. దీని ప్రభావంతో గురువారం వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదే సమయంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
వాతావరణ శాఖ మరో సారి వర్షాల పైన హెచ్చరిక చేసింది. మంగళవారం తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. బుధవారం వరకు సముద్రంలో గంటకు గరిష్ఠంగా 55 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ప్రస్తుత వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులను అరుదైన ఘటనగా వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. తాజా ప్రభావం తో కోస్తా జిల్లాలను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తే ముప్పు పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతంలో వాతావరణం అనుకూలంగా ఉండడంతో తీవ్ర అల్పపీడనం దిశ మార్చుకుంది.

తాజా అంచనాల ప్రకారం సోమవారం కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురవనున్నాయి. మంగళ, బుధవారాల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆ తర్వాత కూడా రెండుమూడు రోజుల వరకు కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గత వారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. ఫలితంగా పంట నష్టం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గత రెండు నెలల కాలంగా వరుసగా ఏర్పడుతున్న అల్ప పీడన ధోరణితో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసాయి.
ఇక, ఇప్పుడు మరోసారి కోస్తా జిల్లాలకు వాతావరణ తాజా హెచ్చరిక చేసింది. అదే సమయంలో ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో, వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications