శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్..!!
Srisailam temple: ప్రఖ్యాత శైవక్షేత్రం శ్రీశైలంలో వెలసిన శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఆలయం అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. సామాన్య భక్తులకు మల్లికార్జునుడి ఉచిత స్పర్శ దర్శనం అందుబాటులోకి వచ్చింది. మంగళవారం నాడే దీన్ని లాంఛనంగా ప్రారంభించారు ఆలయం అధికారులు.
దీంతో మలన్నను దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సంఖ్య అమాంతంగా పెరిగింది. ఉదయం ఉచిత దర్శనం, స్పర్శ దర్శనాలను కల్పించారు. దాదాపుగా సంవత్సరకాలం తరువాత శ్రీశైలంలో ఉచిత స్పర్శ దర్శనం సేవలు ప్రారంభం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇదివరకట్లాగే ప్రతి మంగళ, బుధ, గురు, శుక్ర వారాల్లో మధ్యాహ్నం స్పర్శ దర్శనం ఉంటుంది. మద్యాహ్నం 1:45 నుంచి 3:45 నిమిషాల వరకు వరకు భక్తులకు అనుమతి ఇస్తారు. మల్లికార్జున స్వామి స్వయంగా స్పర్శించే భాగ్యం భక్తులకు అందుబాటులోకి వచ్చింది. దీనికోసం కొత్తగా టోకెన్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు ఆలయ అధికారులు.
దీనితోపాటు ప్రతి రోజు ఆఫ్ లైన్ లో కూడా శ్రీశైలంలో గల ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఉచిత స్పర్శదర్శనం టోకెన్లను జారీ చేస్తామని శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు అన్నారు. భక్తుడి పేరు, ఆధార్, ఫోన్ నంబర్ నమోదు చేసి టోకెన్లు ఇస్తామని తెలిపారు. టోకెన్లను స్కానింగ్ చేసుకున్న తర్వాత భక్తులు ఉచిత దర్శనానికి వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
మధ్యాహ్నం పూట కూడా స్పర్శదర్శనం కల్పించాలంటూ భక్తుల నుంచి పెద్ద ఎత్తున వస్తోన్న విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీన్ని పునఃప్రారంభించారు. మధ్యాహ్నం వేళల్లో స్పర్శ దర్శనం కల్పించడానికి వైదిక కమిటీ, అధికారులు గతంలోనే తమ సుముఖత వ్యక్తం చేశారు.
గతంలో సేవా టికెట్ల జారీలో కీలక మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఆలయంలో జారీ చేసే అన్ని రకాల ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనం టికెట్లను ఇకపై ఆన్‌లైన్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనం టికెట్లను జారీ చేయడానికి ఏర్పాటు చేసిన కరెంట్ బుకింగ్ విధానానికి బదులుగా ఆన్‌లైన్ వ్యవస్థను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఆర్జిత సేవ, స్పర్శ దర్శనం టికెట్లు పొందిన వారు ఆన్‌లైన్‌లో తాము బుక్ చేసుకున్న టికెట్ల కాపీని దర్శన సమయంలో అధికారులకు చూపించాల్సి ఉంటుంది. వాటిని స్కాన్ చేసి, సదరు భక్తుడి వివరాలు సరిపోలిన తరువాతే ఆర్జిత సేవ, స్పర్శ దర్శనానికి అనుమతి ఇస్తారు. భక్తులు తమ వెంట తప్పనిసరిగా ఆధార్ కార్డును వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది.
కాగా- భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను నడిపించే అవకాశాలు లేకపోలేదు. జిల్లా కేంద్రమైన నంద్యాల, కర్నూలు, ఆత్మకూరు, నందికొట్కూరు, ఒంగోలు, విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకుని రావొచ్చు.












Click it and Unblock the Notifications