తిరుపతి-సికింద్రాబాద్ వందేభారత్ రైలులో భారీగా పొగలు: ప్రయాణికుల పరుగు
హైదరాబాద్: తిరుపతి-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు రావడంతో బుధవారం సాయంత్రం నెల్లూరు జిల్లా మనుబోలు రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వస్తున్న వందేభారత్ రైలు మనుబోలు సమీపంలోకి రాగానే పొగలు రావడం గుర్తించిన సిబ్బంది వాకీటాకీ ద్వారా లోకో పైలట్‌కు సమాచారం అందించారు.
రైలును మనుబోలు స్టేషన్‌లో నిలిపివేయడంతో అప్పటికే భయాందోళనలో ఉన్న ప్రయాణికులు బోగీల నుంచి హుటాహుటిన కిందకు దిగారు. మూడో బోగీలోని బాత్రూం నుంచి పొగలు రావడంతో సిబ్బంది వెళ్లి పరిశీలించారు. బాత్రూంలో కాల్చి పడేసిన సిగరెట్ ముక్క వల్లే పొగ వ్యాపించిందని నిర్ధరించారు.

ఈ ఘటనకు కారణమైన టికెట్ లేని ప్రయాణికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పివేసి రైలును అక్కడ్నుంచి పంపించేశారు. దీంతో అరగంటకుపైగా రైలు నిలిచిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.
ఇది ఇలావుండగా, వందేభారత్ రైలుపై వరుస రాళ్ల దాడులు కలవరపెడుతున్నాయి. వందేభారత్ ప్రారంభమైన నాటినుంచి దుండగులు ఈ రైళ్లే లక్ష్యంగా రాళ్ల దాడులు చేస్తున్నారు. తాజాగా, ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకిలో వందేభారత్(Vande Bharat) రైలుపై దుండగులు రాళ్లు రావడంతో ఒక కోచ్ కిటికీలు పగిలిపోయాయి.
గోరఖ్‌పూర్ నుంచి లక్నోకు ఆదివారం ఉదయం 6 గంటలకు వందే భారత్ రైలు బయల్దేరింది. బారాబంకిలో సఫేదాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. దీంతో కోచ్ కిటికీలు పగిలిపోయాయి. ప్రయాణికులకు ఎలాంటి గాయాలూ కాలేదు.

రైల్వే రక్షణ దళం(ఆర్పీఎఫ్) ఈ ఘటనపై కంట్రోల్ రూంకు సమాచారం అందించింది. దీంతో బారాబంకి రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినందుుక సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రైలులో అమర్చిన సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా దాడి చేసిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాగా, గోరఖ్‌పూర్ నుంచి లక్నో వెళ్తున్న వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరగడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా వందేభారత్ రైళ్లపై దాడులు జరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది.












Click it and Unblock the Notifications