నేనేమి నిద్రపోవడం లేదు, పరిష్కరిస్తా: చంద్రబాబు
పశ్చిమగోదావరి: రైతు రుణాల రీషెడ్యూల్ పై కాంగ్రెస్ పార్టీ ఏనాడూ ఆలోచించలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన బుధవారం పశ్చిమగోదావరి జిల్లాలోని కామవరపుకోటలో పర్యటించిన సందర్భంగా మాట్లాడారు. ఓ వైపు రుణాల మాఫీ చేస్తూనే.. అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తామని చెప్పారు. రుణాలు కట్టిన వారికి, కట్టని వారికి అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు.
తానేమి నిద్రపోవడం లేదని చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం ఉదయమే రిజర్వు బ్యాంక్ గవర్నర్‌తో ఫోన్‌లో మాట్లాడానని తెలిపారు. ఇప్పటికే ఆర్థికమంత్రి తోపాటు ప్రధానితో కూడా రుణాల మాఫీ, రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడానని తెలిపారు. రేపో ఎల్లుండో రుణాల రీషెడ్యూల్ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా ఇబ్బందులున్నాయని చెప్పారు. వాటన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పారు. తాము రుణమాఫీ మాట నిలబెట్టుకుంటామని అన్నారు. రాష్ట్రంలో అప్పులు ఎక్కువ, ఆస్తులు తక్కువ ఉన్నాయని, ఇంకొంత కాలం ఇదే కొనసాగుతుందని అన్నారు.

గుజరాత్ తర్వాత అంత అనువైన రాష్ట్రం ఏపినే అని అన్నారు. ఏపి అభివృద్ధి కేంద్ర సహకారం తీసుకుంటామని చెప్పారు. డ్వాక్రా సంఘాల రుణాలు కూడా మాఫీ చేస్తామని చెప్పారు. నష్టాల్లో ఉన్న కైలు రైతులను ఆదుకుంటామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేస్తామని చెప్పిన చంద్రబాబు.. దేశంలోనే అతిగొప్ప రాష్ట్రంగా ఏపిని తీర్చిదిద్దుతామని అన్నారు.
రాష్ట్రంలో కొనసాగుతున్న లాండ్, ఇసుక మాఫీయాను అరికట్టేందుకు చట్టం తీసుకొస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇంటికొక రుణమాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది తెలిపారు. విదేశాల్లో డిమాండ్ ఉండటంతో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారని, వీరప్పన్ బ్యాచ్ ఇక్కడికే వచ్చిందన్నారు. ఇప్పటికే పదివేల మంది స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇక్కడి కొందరు నాయకులు వారికి సహకరిస్తున్నారని అన్నారు.
ఇప్పటికే స్మగ్లర్ల నుంచి 15వేల మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని సీజ్ చేశారని చెప్పారు. ఎర్రచందనానికి గ్లోబల్ టెండర్లు నిర్వహించి, ప్రభుత్వానికి ఆదాయం తీసుకొస్తామని అన్నారు. ఆ ఆదాయంతో పేదల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ఎక్కడ ఏ పంటలు పండుతాయో అక్కడ అవే పంటలు పండించాలని అన్నారు. ఐఏఎస్, ఐపిఎస్‌ల కేటాయింపుపై ఇప్పటివరకు స్పష్టత లేదన్నారు.












Click it and Unblock the Notifications