పవన్‌ను వేదన అర్థం చేస్కున్నా: జెపి, రఘువీరాకి షాక్
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనకు మద్దతుగా ప్రచారం చేయనని చెప్పిన అంశంపై లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు, మల్కాజిగిరి లోకసభ బరిలో ఉన్న జయప్రకాశ్ నారాయణ బుధవారం స్పందించారు. పవన్ తీవ్ర ఒత్తిడి కారణంగానే మల్కాజిగిరిలో తనకు ప్రచారం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ మానసిక సంఘర్షణను తాను అర్థం చేసుకోగలుగుతున్నానని చెప్పారు.
పవన్ తనకు సొంత తమ్ముడి కన్నా ఎక్కువ సాయం చేశారని చెప్పారు. ఆయన ఆవేదనను తాను పూర్తిగా అర్థం చేసుకున్నానన్నారు. దీని వల్ల తమ స్నేహానికి వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు. పవన్ తన కోసమే మల్కాజిగిరి నుండి బరిలోకి దిగాలనుకున్న విరమించుకున్నారని గుర్తు చేశారు. పవన్ మానసిక సంఘర్షణ తనకు బాధ కలిగిస్తోందన్నారు. చంద్రబాబును తాను ప్రత్యేకంగా విమర్శించనని చెప్పారు.

కిరణ్‌కు షాక్
కడప శాసనసభ స్థానంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ జై సమైక్యాంధ్రకు ఎదురు దెబ్బ తగిలింది. కడప నుండి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సింగిరెడ్డి మల్లారెడ్డి బుధవారం తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు.
రఘువీరాకు ఝలక్
రఘువీరా సొంత నియోజకవర్గం కళ్యాణదుర్గంలో కాంగ్రెసు పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ కళ్యాణదుర్గం అభ్యర్థి దేవేంద్రప్ప నామినేషన్ ఉపసంహరించుకున్నారు. జగన్ పార్టీ నుండి ముడుపులు తీసుకొని విరమించుకున్నారని కాంగ్రెసు పార్టీ స్థానిక క్యాడర్ నిప్పులు చెరుగుతోంది. మరోవైపు విశాఖ జిల్లా నర్సీపట్నంలో కాంగ్రెస్ అభ్యర్థి కె అప్పలనాయుడు పోటీ నుంచి తప్పుకున్నారు.












Click it and Unblock the Notifications