విజయవాడ నుంచి హైదరాబాద్ గంటన్నరే: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం కొత్త రైల్వే లైన్ ప్రకటించింది. 56 కిలోమీటర్లు ఉండే ఈ లైను నిర్మాణం త్వరలోనే ప్రారంభం కాబోతోంది. నాలుగు సంవత్సరాల్లో పూర్తిచేస్తామని కేంద్రం చెబుతుండగా, మూడు సంవత్సరాల్లో పూర్తయ్యేలా చూడాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ను రిక్వెస్ట్ చేశారు. సాధ్యమైనంత వేగంగా పూర్తిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లాలోని ఎర్రుపాలెం నుంచి ప్రారంభమయ్యే ఈ లైను గుంటూరు జిల్లాలోని నంబూరు దగ్గర కలుస్తుంది. మధ్యలో అతి పెద్ద రైల్వే స్టేషన్ గా అమరావతి రైల్వే స్టేషన్ ఉంటుంది. ఈ మార్గంలో కొత్తగా తొమ్మిది రైల్వేస్టేషన్లు నిర్మిస్తారు.
అన్ని ప్రధాన నగరాలకు రైళ్లు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ విధ్వంసానికి చిరునామాగా ఉన్న ఏపీని అభివృద్ధి పథంవైపు నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అమరావతి రైల్వే లైనును మరింత విస్తరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతికి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, నాగపూర్, కోల్ కతా నుంచి రైళ్లు వస్తుంటే అన్నిరకాలుగా అభివృద్ధి జరుగుతుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. రైల్వే లైను పూర్తయిన తర్వాత అమరావతి నుంచి హైదరాబాద్ కు, అమరావతి నుంచి చెన్నైకి, అమరావతి నుంచి విశాఖపట్నంకు, అమరావతి నుంచి బెంగళూరుకు వందేభారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు.

వందేభారత్ తర్వాత బుల్లెట్ రైలు
గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ట్రాక్ నిర్మాణం జరపనున్నారు. వందేభారత్ తర్వాత బుల్లెట్ రైలు కూడా అందుబాటులోకి రాబోతున్నట్లు చంద్రబాబు చెప్పారు. ప్రస్తుతం అహ్మదాబాద్-ముంబయి మధ్య నిర్మిస్తున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టు పూర్తికావొచ్చిందని, వచ్చే ఏడాది ఇది పట్టాలెక్కే అవకాశం ఉందన్నారు. దక్షిణాదిలో నిర్మించే బుల్లెట్ రైలు ప్రాజెక్టు అమరావతి నుంచి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాలను అనుసంధానం చేసేలా నిర్మించాలని ప్రధానమంత్రిని కోరగా, ఆయన అందుకు అంగీకరించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే అమరావతి నుంచి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ గంటన్నరలోనే చేరుకోవచ్చన్నారు. దక్షిణ భారతదేశంలో అమరావతి రాకుండా ఏ రైలు ప్రయాణం కొనసాగించలేని విధంగా లాజిస్టిక్స్ హబ్ గా తయారుచేయబోతున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications