అమరావతిని అక్కడా వదలని జగన్-స్కూల్ బుక్స్ లో పాఠం కూడా ఎత్తేసిన వైనం
ఏపీ ప్రస్తుత రాజధాని అమరావతి ముద్రను చెరిపేసేందుకు ఏ చిన్న అవకాశాన్నీ జగన్ సర్కార్ వదలడం లేదు. ఇప్పటికే రాజధానిగా అమరావతి పేరును తొలగించి మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చిన వైసీపీ సర్కార్.. ఇప్పుుడ మిగిలిన విషయాల్లోనూ అమరావతి ముద్ర కనిపించకుండా జాగ్రత్త పడుతోంది. అందుకే తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అమరావతి చరిత్ర ఇక చరిత్రలోనే కనిపించబోతోంది.
అమరావతి పేరు కనిపించకుండా చేపడుతున్న చర్యల్లో భాగంగా ఇప్పటికే అక్కడ ప్రతిపాదిత అంబేద్కర్ స్మృతివనం తొలగించి విజయవాడకు ఈ ప్రాజెక్టను తరలించిన వైసీపీ సర్కార్.. ఇప్పుడు పాఠ్య పుస్తకాల్లో సైతం అమరావతి చరిత్ర కనిపించరాదని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఏపీ విద్యాశాఖ అధికారులు అమరావతి చరిత్రను పదో తరగతి పాఠ్యపుస్తకాల నుంచి తొలగిస్తూ తాజాగా పుస్తకాలు ముద్రించారు. ఈ బుక్స్ నే విద్యార్ధులకు ఇవ్వాలని వారికి ఆదేశాలు వెళ్లాయి. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో తెలుగు భాష పుస్తకంలో సాంస్కృతిక వైభవం ఇతివృత్తం కింద అమరావతి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చారు. పలు ఉద్యోగ పరీక్షల్లో సైతం అమరావతిపై ప్రశ్నలు కూడా అడిగేవారు. కానీ టీడీపీ సర్కార్ అధికారం కోల్పోయాక అమరావతికి కష్టాలు మొదలయ్యాయి.

ఇప్పటికే అమరావతిలో చేపట్టిన పలు ప్రాజెక్టుల్ని అర్ధాంతరంగా నిలిపేయడమే కాకుండా కొత్త ప్రాజెక్టులకు సైతం అనుమతివ్వని జగన్ సర్కార్ ఇప్పుడు పాఠ్యపుస్తకాల్లోనూ అమరావతి పేరు కనిపించకూడదు, వినిపించకూడదన్న ధోరణిలో ముందుకెళుతోంది. అందుకే తాజాగా ముద్రించిన పాఠ్య పుస్తకాల్లో అమరావతి పాఠం తొలగించడమే కాకుండా.. కొత్త పాఠ్యపుస్తకాలే ఇవ్వాలని కోరారు. అయితే విచిత్రంగా ఈ విద్యాసంవత్సరానికి విద్యార్ధులకు ఇప్పటికే పాత పాఠ్య పుస్తకాలు ఇవ్వడం, అందులో ఉన్న అమరావతి చరిత్రను ఈ ఏడాది విద్యార్ధులకు టీచర్లు బోధించడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు అమరావతి చరిత్రలేని పుస్తకాలను విద్యార్ధులకు ఇచ్చి పాత పుస్తకాలు తీసేసుకోవాలని స్కూళ్లకు ఆదేశాలు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేవలం అమరావతి చరిత్ర కోసమే పాఠ్యపుస్తకాలను తిరిగి ముద్రించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications