వందే భారత్ ప్రయాణికులకు శుభవార్త
సెమీ హైస్పీడ్ రైళ్లుగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లు ప్రయాణికుల ఆదరణను దక్కించుకుంటున్నాయి. కొన్ని మార్గాల్లో మాత్రం ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయనే విమర్శలున్నప్పటికీ ఆక్యుపెన్సీ బాగుంటోంది. భవిష్యత్తులో వీటి వేగాన్ని పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఇవి గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలరు. కానీ ట్రాక్ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని 120 నుంచి 130 కిలోమీటర్లకు పరిమితం చేశారు.
200 నుంచి 220 కిలోమీటర్లకు వేగాన్ని పెంచేలా చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ప్రణాళికలు రచిస్తున్నారు. రైల్వేబోర్డుతో సంప్రదింపులు కూడా పూర్తయ్యాయి. ఈ వేగం అందుకోవాలంటే వీటిల్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం వందే భారత్ రైళ్లకు స్టెయిన్ లెస్ స్టీల్ వాడుతున్నారు. సెమీ హైస్పీడ్ నుంచి హైస్పీడ్ రైళ్లుగా రూపాంతరం చెందాలంటే వీటిని అల్యూమినియంతో తయారు చేయాల్సి ఉంటుంది.

ఇదంతా కార్యరూపం దాల్చి ప్రొటోటైప్ రైలు సిద్ధమవడానికి దాదాపు రెండు సంవత్సరాల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత ప్రయోగాత్మకంగా కొన్ని మార్గాల్లో పరుగులు పెట్టిస్తారు. సిగ్నలింగ్ వ్యవస్థలో కూడా సాంకేతిక మార్పులు రానున్నాయి. భవిష్యత్తులో గంటకు 245 కిలోమీటర్ల వేగాన్ని అందుకేనేలా వీటి డిజైన్ లో మార్పులు చేయబోతున్నారు. అయితే పట్టాలపై మాత్రం గంటకు 220 కిలోమీటర్లలోపే ప్రయాణించనున్నాయి.
మరో ఏడాది, ఏడాదిన్నర సమయంలో ముంబయి-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు అందుబాటులోకి రాబోతోంది. ఛార్జీలు నాలుగు రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రయాణ సమయం తగ్గుతుండటంతో వీటికి ప్రయాణికుల నుంచి ఆదరణ ఎలా ఉండబోతోంది? ఛార్జీల విషయమై ఏం చేయాలి? తదితర అంశాలపై ఒక స్పష్టత రానుంది. వీటికనుగుణంగా వందే భారత్ తయారీలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి.












Click it and Unblock the Notifications