ఏపీలో ఇంటర్న్‌షిప్ పేరుతో వెట్టి చాకిరి
YS Jagan: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..పై వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస పోరాటాలకు దిగారు.
వైద్య విద్యార్థుల ఉదంతంపై ఆయన స్పందించారు. విదేశాల్లో మెడికల్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయిస్తారా అంటూ ప్రశ్నించారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్లంతా ఇక్కడ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ (FMG) ఎగ్జామ్‌లో ఉత్తీర్ణులైన తరువాత, ఇక్కడే ఇంటర్న్‌షిప్ పూర్తిచేసినా, ఎందుకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వట్లేదని నిలదీశారు.

ఇంటర్న్‌షిప్ పేరుతో దీర్ఘకాలం వెట్టి చాకిరి చేయించుకుంటూ, ప్రైవేటు మెడికల్ కాలేజీలకు లాభం చేకూర్చేలా, ఉద్దేశ పూరకంగా వీరికి పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వకపోవడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలని తల్లిదండ్రులు అప్పులు చేసి, ఆస్తులు అమ్మి తమ పిల్లలను విదేశాలకు పంపించారని, వాళ్లంతా కష్టపడి చదువుకుని కోర్సులు పూర్తిచేశారని అన్నారు.
అలాంటి వారి కెరీర్ ను నాశనం చేయడం ఎంతవరకు సమంజసం? వారిని నిరుత్సాహపరచాలన్నది ప్రభుత్వ ప్లాన్‌లో భాగం కాదా అని జగన్ నిలదీశారు. డాక్టర్లు కావాలనుకుంటున్న పిల్లలు విదేశాలకు వెళ్లి చదువుకునే ఇబ్బందుల్లేకుండా, ఇక్కడే, మన రాష్ట్రంలోనే, ప్రభుత్వరంగంలో 17 కాలేజీలను, వాటిద్వారా 2,550 సీట్లను తీసుకు వచ్చేలా గతంలో తమ ప్రభుత్వం పనులు చేసి, అందులో అయిదు కాలేజీలను ప్రారంభించిందని గుర్తు చేశారు.
మిగిలిన కాలేజీలను కూడా పూర్తిచేసే స్థాయికి తాము తీసుకువెళ్తే, టీడీపీ కూటమి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా అడ్డుకుందని జగన్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం సీట్లు కేటాయిస్తే, వాటిని వద్దు అన్న ప్రభుత్వం.. దేశ చరిత్రలో ఇదొక్కటేనని చెప్పారు. అవినీతి కోసం స్కామ్ లు చేస్తూ ఆ కాలేజీలను ప్రయివేటీకరించే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.
పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్‌ఎంసీ కేటాయించిన సీట్లను కూడా వద్దు అంటూ తిరిగి లేఖ రాసి, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. ఇప్పుడు దేశం కాని దేశం వెళ్లి అక్కడ ఖర్చులు తగ్గించుకుని, కష్టపడి కోర్సులు పూర్తి చేసి వస్తే, వారికి పీఆర్ నంబర్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.
ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన వారికి వెంటనే రిలీవింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని, ఎన్‌ఎంసీ గైడ్ లైన్స్ ప్రకారం ఎఫ్‌ఎంజీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వీరికి వెంటనే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications