నోరు మూసుకోవడం మంచిది..
YS Jagan: సార్వత్రిక ఎన్నికల్లో దిగ్భ్రాంతికర ఓటమిని ఎదుర్కొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరిన్ని ఇబ్బందుల్లో పడ్డారు. ఒకవంక సీనియర్ నేతలు ఒకరి తరువాత ఒకరుగా పార్టీని వీడుతోండగా.. మరోవంక కుటుంబపరంగా లుకలుకలను ఎదుర్కొంటోన్నారు.
ఆస్తి పంపకాల వ్యవహారంలో వైఎస్ జగన్ కుటుంబంలో విభేదాలు భగ్గుమన్నాయి. ఇది కాస్తా పిటీషన్లు వేసే స్థాయికి వెళ్లింది. గతంలో ఇదే విషయంపై జగన్ చెల్లెలు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల- వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అలాంటి ఉదంతాలే జగన్ కుటుంబంలో చోటు చేసుకున్నాయి.

ఆస్తుల పంపకాల విషయంలో స్వయానా జగన్ తల్లి వైఎస్ విజయమ్మ సైతం కూతురి వైపే నిలిచారు. షర్మిలకు మద్దతుగా బహిరంగ లేఖను విడుదల చేశారు. కుటుంబపరమైన సున్నితాంశాలను అందులో ప్రస్తావించారు. ఇది తెలుగుదేశం పార్టీకి మరో ఆయుధంలా మారింది.
జగన్‌పై సొంత బావ, ఎవాంజలిస్ట్ బ్రదర్ అనిల్ కుమార్ ఘాటు విమర్శలు గుప్పించారు. ఆస్తి కోసం తన తల్లి, చెల్లినీ లెక్క చేయట్లేదంటూ మండిపడ్డారు. ఆస్తుల కోసం ఎందాకైనా వెళ్తాడని, వారిద్దరిపైనా నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో పిటీషన్లు వేయడాన్ని దీనికి ఉదాహరణగా చెప్పారు.
విజయమ్మ రాసిన లేఖకు వైఎస్ఆర్సీపీ ఎదురుదాడి చేసింది. ఓ బహిరంగ లేఖను విడుదల చేసింది. జగన్‌ను చట్టపరంగా ఇబ్బంది పెట్టడానికి, బెయిల్ రద్దుకు జరిగిన కుట్ర వ్యవహారాన్ని విజయమ్మ ప్రస్తావించకపోవడం సరికాదని, ప్రజలను పక్కదోవపట్టించడమేనని పేర్కొంది.
రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ఈ పరిణామాలపై తాజాగా సీపీఐ సీనియర్ నేత నారాయణ స్పందించారు. జగన్- షర్మిల వ్యక్తిగత ఆస్తుల తగాదాను రాజకీయాలతో ముడిపెట్టడం ఏ మాత్రం సరికాదని అన్నారు. కుటుంబ తగాదాలకు రాష్ట్ర రాజకీయాలకు సంబంధం లేదని పేర్కొన్నారు.
ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. జగన్- షర్మిల ఆస్తి పంపకాల విషయంలో వాళ్ల తల్లి విజయమ్మ కూడా జోక్యం చేసుకున్నారని, ఈ వ్యవహారం పూర్తిగా కుటుంబపరమైనదేనని ఆమె స్పష్టం చేశారని నారాయణ అన్నారు. అలాంటప్పుడు వేరే వాళ్లు ఎందుకు నోళ్లు తెరుస్తున్నారని, నోళ్లు మూసుకోవడం మంచిదని కరాఖండిగా చెప్పారు.
అది అన్నాచెల్లెళ్ల మధ్య తలెత్తిన గొడవలని, కుటుంబ వ్యవహారమని, ఎంతమాత్రం రాజకీయపరమైనది కాదని నారాయణ పేర్కొన్నారు. ఆస్తుల కోసం ఇద్దరు అన్నాచెల్లెళ్ల మధ్య జరిగే గొడవను రాజకీయంగా చూడటం కరెక్ట్ కాదని, కోర్టుకెళ్లి పరిష్కరించుకుంటారని చెప్పారు.
విజయమ్మ కూడా స్పష్టంగా చెప్పిన తరువాత బయటివాళ్లు అనవసరంగా నోరు పారేసుకోవడం, మాట్లాడుకోవడం, వాగ్యుద్ధానికి దిగడం మంచిది కాదని, అందరూ నోరుమూసుకోవాలని హితబోధ చేశారు. జగన్- షర్మిల ఇద్దరూ తెలివైన వాళ్లేనని, వారికి ఒకరు చెప్పాల్సిన పని లేదని, ఈ విషయంలో బయటి వ్యక్తులు మాట్లాడటం సమంజసం కాదని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications