మీటింగ్ లో 'జై జగన్' నినాదాలు.. చంద్రబాబు షాకింగ్ రియాక్షన్
సాధారణంగా ఓ సినిమా హీరో ఫంక్షన్ లో మరో హీరో నినాదాలు వినిపించడం మనం చూస్తుంటాం. ఈ ట్రెండ్ ప్రస్తుతం రాజకీయాలకూ అంటుకుంది. అధికార పార్టీ నేతల సభల్లో ప్రతిపక్ష నాయకుల నినాదాలు ఇవ్వడం ప్రారంభమైంది. తాజాగా ఇలాంటి అనుభవమే ఏపీ సీఎం చంద్రబాబుకు ఎదురైంది. చంద్రబాబు సభలో జగన్ నినాదాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఏమైందంటే..
సీఎం చంద్రబాబు బాపట్ల జిల్లాలో పర్యటించారు. చిన్నగంజాం మండలం కొత్తగొల్లపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన ప్రజా వేదిక సభలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా ఓ యువకుడు అకస్మాత్తుగా 'జై జగన్'.. 'జై జగన్' అంటూ నినాదాలు చేశాడు. దీంతో సీఎం చంద్రబాబు ఒక్కసారిగా షాక్ కు గురి అయ్యారు. ఆ నినాదాలతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆ యువకుడి వైపు వెళ్లింది.

దీంతో మొదట చంద్రబాబు ఆగ్రహించారు. ఆ తర్వాత తన రాజకీయ చతురత, సమయస్ఫూర్తితో వ్యవహరించారు. ఓ వైపు నవ్వుతూనే ఆ యువకుడికి చురకలు అంటించారు. " ఇప్పుడు ఒక కుర్రాడొచ్చాడు. అతను ఏ గ్రామం నుంచి వచ్చాడో తెలియదు. అతనికి కడుపు నొప్పి ఉంటే.. డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. వేరే ఏదైనా బాధ ఉంటే నా దగ్గరకు రావాలి. కానీ, ఇలా కేకలు వేస్తే, అతని కడుపు నొప్పి పెరుగుతుంది" అని చెప్పుకొచ్చారు.
తన రాజకీయ జీవితంలో ఇటువంటి సందర్భాలు ఎన్నో చూశానన్నారు. 43 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఎవరైనా నిలదీయాలనుకుంటే గౌరవంగా వచ్చి తనకు చెప్పాలని.. అలా అయితే సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబు సమయస్పూర్తికి సభలోని వాళ్లంతా చప్పట్లు కొట్టారు.












Click it and Unblock the Notifications