శుంఠ పదంపై వెనక్కి తగ్గిన కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి
న్యూఢిల్లీ: సీమాంధ్ర నాయకులను ఉద్దేశించి తాను వాడిన శుంఠ అనే పద ప్రయోగంపై తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి వెనక్కి తగ్గారు. ఆ పద ప్రయోగంపై ఆయన సోమవారం వివరణ ఇచ్చారు. తాను ఎవరినీ ఉద్దేశించి ఆ పదాన్ని వాడలేదని వివరణ ఇచ్చారు.
సీతారామయ్య పాండిత్యాన్ని శ్లాఘిస్తూ వ్యంగ్యంగా సీమాంధ్ర నాయకులపై ఆ పదాన్ని ప్రయోగించానని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను ఇప్పటి సీమాంధ్ర నాయకులు గుర్తించలేకపోతున్నారనేది తన ఆవేదన ఆయన అన్నారు. తన వ్యంగ్యాన్ని సీమాంధ్ర నాయకులు తిట్టుగా చిత్రీకరించారని ఆయన అన్నారు. ఎవరినో తిట్టాలన్న ఉద్దేశం తనకు లేదని ఆయన అన్నారు.

సీమాంధ్ర నేతలది అజ్ఞానంతో కూడిన బాధ అని, ప్రకాశం పంతులు పుట్టిన నేలపై శుంఠలు పుట్టారన్న కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి పైన పార్టీలకతీతంగా సీమాంధ్ర ప్రాంత నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావులా జైపాల్ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ తహసిల్దార్ల సంఘం డైరీని జైపాల్ రెడ్డి ఆవిష్కరించిన అనంతరం సీమాంధ్ర నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డ విషయం తెలిసిందే.
ఆయన వ్యాఖ్యలపై సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల నేతలు తప్పు పట్టారు. తెలుగుదేశం పార్టీ నేతలు దుమ్మెత్తి పోశారు. జైపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఏమాత్రం సరికాదని మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి అన్నారు. అదే సమయంలో ఢిల్లీలో చివరి బంతి ఉంటుందని, అక్కడ ఆడాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి జైపాల్ సూచించడం పైనా ఆయన స్పందించారు. తాము సరంజామా సర్దుకుంటున్నామని కౌంటర్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications