ఎన్డీఏ భేటీకి జనసేనకు ఆహ్వానం - టీడీపీకి షాక్, పవన్ ఏం చేయబోతున్నారు..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్డీఏ సమావేశానికి జనసేనకు ఆహ్వానం అందింది. ఈ నెల 18న ఎన్డీఏ మిత్రపక్షాలతో సమావేశానికి బీజేపీ నిర్ణయించింది. టీడీపీకి ఇప్పటి వరకు ఆహ్వానం అందలేదని సమాచారం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేయాలనేది పవన్ ఆలోచన. ఇప్పుడు టీడీపీకి ఆహ్వానం అందకపోవటంతో పవన్ ఏం చేయబోతున్నారు. ఈ ఆహ్వానం ద్వారా బీజేపీ వ్యూహం ఎంటనేది చర్చ మొదలైంది.
జనసేనకు ఆహ్వానం..!: జాతీయ స్థాయిలో మరుతున్న రాజకీయ సమీకరణాల్లో భాగంగా బీజేపీ నాయకత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. గతంలో ఎన్డీఏ భాగస్వాములుగా ఉండి దూరమైన రాజకీయ పార్టీలతో పాటుగా భావ సారూప్యత కలిగిన పార్టీలతో ఈ నెల 18న ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశానికి పలు పార్టీలకు ఆహ్వానాలు అందాయి.

తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ గతంలో ఎన్డీఏ భాగస్వామిగా ఉంది. కానీ, ఇప్పటి వరకు ఈ సమావేశానికి సంబంధించి టీడీపీకి ఆహ్వానం పంపలేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. అన్నాడీఎంకే, తమిళ్ మనీలా కాంగ్రెస్, పీఎంకే, లోక్ జనశక్తి, హిందుస్తానీ ఆవామ్ మోర్చాకు ఆహ్వానాలు పంపారు. శిరోమణి ఆకాలీ దల్ ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
టీడీపీకి పిలుపు వస్తుందా: మహారాష్ట్రలోని శివసే, ఎన్సీపీ చీలిక వర్గాలకు ఆహ్వానాలు పంపారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జనసేన మాత్రమే తమ మిత్రపక్షంగా బీజేపీ చెబుతోంది. ఏపీకే ఈ పొత్తును పరిమితం చేసింది. తెలంగాణలో పొత్తు లేదనే సంకేతాలు ఇస్తోంది. ఇక, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశంతో పాటుగా కలిసి కట్టుగా సాగే క్రమంలో మిత్రులతో కీలక భేటీ ఏర్పాటు చేసింది.
ఈ సమావేశానికి పవన్ కల్యాణ్ ను ఆహ్వానించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సమావేశానికి పవన్ తో పాటుగా మనోహర్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ.. బీజేపీ ఇప్పటి వరకు టీడీపీకి ఆహ్వానం పంపకుండా..జనసేనను ఆహ్వానించటం కొత్త సమీకరణాలకు కారణమవుతోంది.

పవన్ నిర్ణయమే కీలకం: టీడీపీతో రెండు రాష్ట్రాల్లో పొత్తు ద్వారా తెలంగాణలో తమకు నష్టం జరుగుతోందని ఆ రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు. దీంతో, అయిదు రాష్ట్రాల ఎన్నికల తరువాత అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయనే చర్చ వినిపిస్తోంది. ఎన్నికల్లోగా ఎలాగైనా బీజేపీని ఒప్పించి మూడు పార్టీలు కలిసి వైసీపీకి వ్యతిరేకంగా బరిలోకి దిగాలనేది పవన్ కల్యాణ్ వ్యూహంగా స్పష్టం అవుతోంది.
టీడీపీ నేతలు ఈ విషయంలో ఆచితూచి స్పందిస్తున్నారు. బీజేపీ నుంచి ఆహ్వానం వచ్చిన తరువాతనే స్పందించాలనే ఆలోచనలో ఉన్నారు. టీడీపీతో బీజేపీ పొత్తుకు నో చెబితే పవన్ అప్పుడు ఏం చేస్తారనేదే ఇప్పుడు ఏపీలో పొత్తుల రాజకీయంలో కీలక అంశంగా మారనుంది.












Click it and Unblock the Notifications