పవన్.. ఛలో ఢిల్లీ: చక్రం తిప్పడానికి- వెంట భార్య, కొడుకు
Pawan Kalyan: రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. అటు అసెంబ్లీ, ఇటు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు దారుణంగా ఓడిపోయారు. 175 అసెంబ్లీ స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీకి దక్కింది.. పట్టుమని 11 స్థానాలే.
అటు టీడీపీ- జనసేన- బీజేపీ 164 అసెంబ్లీ స్థానాల్లో ఘన విజయం సాధించింది. టీడీపీ- 135, జనసేన- 21, బీజేపీ- 8 నియోజకవర్గాల్లో జయకేతనాన్ని ఎగురవేశాయి. తాము పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలిచి జనసేన, బీజేపీ.. సరికొత్త చరిత్రను సృష్టించాయి. పోటీ చేసిన రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ జనసేన అభ్యర్థులు గెలిచారు.

ఈ నేపథ్యంలో- అనూహ్య పరిణామాలు ఏర్పాడుతున్నాయి. టీడీపీ సాధించిన ఈ తిరుగులేని విజయం జాతీయస్థాయిలో అందరినీ ఆకర్షించింది. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా టీడీపీ మద్దతు సైతం అవసరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో అటు బీజేపీ- ఎన్డీఏ కూటమి, ఇటు కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా.. చంద్రబాబు మద్దతును సాధించడానికి తమవంతు ప్రయత్నాలు మొదలు పెట్టాయి కూడా.
ఈ క్రమంలో తమకు మద్దతు ఇస్తే- చంద్రబాబుకు కీలకమైన పదవులను సైతం ఇవ్వడానికి సిద్ధపడ్డాయి ఆ రెండు కూటములు. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న ఎన్డీఏకి చంద్రబాబు మద్దతు ఇస్తారనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ఎన్డీఏ జాతీయ కన్వీనర్‌గా చంద్రబాబును నియమిస్తారనే ప్రచారం హస్తినలో జోరుగా సాగుతోంది.
ఈ పరిస్థితుల మధ్య దేశ రాజధానిలో నేడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరుగనుంది. బీజేపీ.. దీన్ని ఏర్పాటు చేసింది. సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ ఏర్పాటైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించే ఈ సమావేశంలో ఎన్డీఏలో ఉన్న పార్టీల అధినేతలందరూ పాల్గొనబోతోన్నారు.
ఇందులో భాగంగా- జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కొద్దిసేపటి కిందటే ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన వెంట భార్య అన్నా లెజినోవా, తనయుడు అకీరా నందన్ ఉన్నారు. విజయవాడ, గన్నవరం నియోజకవర్గాలకు చెందిన కొందరు టీడీపీ-జనసేన-బీజేపీ నాయకులు ఆయనను కలిశారు. అభినందనలు తెలిపారు.
చంద్రబాబు సైతం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాన్ని ముగించుకన్న అనంతరం ఈ మధ్యాహ్నం ఆయన హస్తినకు బయలుదేరుతారు. ఎన్డీఏ కూటమిలోనే కొనసాగుతానని చంద్రబాబు స్పష్టం చేసిన నేపథ్యంలో ఇక అందరి దృష్టీ నితీష్ కుమార్‌పై నిలిచింది.












Click it and Unblock the Notifications