నాకింతమంది కొడుకులా, తెలియదు: జేసీ వివాదాస్పదం, లోకేష్‌ని బాబు సీఎం చేయాలనుకుంటున్నారు కానీ
అనంతపురం: తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం లోకసభ సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మహానాడులో వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జేసీ విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలకు నిరసనగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.
వైసీపీ నాయకులు జేసీ దివాకర్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసే ప్రయత్ననాలు చేశారు. ఈ ప్రదర్శనలపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్‌పై తాను ఎక్కడా పరుషంగా మాట్లాడలేదన్నారు. వాస్తవ విషయాలు, చరిత్రను చెప్పానని అన్నారు. తాను మాట్లాడిన ప్రతి అక్షరం నిరూపిస్తానన్నారు.

పులివెందుల వెళ్తా, నాకు ఇంతమంది కుమారులున్నారా?
జగన్ పైన తాను చేసిన ప్రతి మాటను నిరూపించేందుకు అవసరమైతే ఆయన సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్లేందుకు కూడా సిద్ధమని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఇటీవల తన వ్యాఖ్యలకు నిరసనగా పలువురు దిష్టిబొమ్మ శవయాత్ర, దహనం వంటివి చేపడుతున్నారని, మన సంప్రదాయం ప్రకారం ఇలాంటి వాటిని తండ్రికి కొడుకులు చేస్తారన్నారు. తనకు ఇంతమంది కుమారులు ఎక్కడి నుంచి వచ్చారో తెలియడం లేదన్నారు.
Recommended Video


వివాదాస్పద వ్యాఖ్యలపై ఆగ్రహం
అంతమంది కొడుకులు ఉన్నారని నాకు తెలియదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. శవాన్ని తీసుకు వెళ్లి ఊరేగింపు నిర్వహించి దహనం చేసేది కొడుకులే అన్నారు. ఈ జిల్లాలో నాకు ఇంతమంది కొడుకులా అన్నారు. ఈయన వ్యాఖ్యలపై వైసీపీ వర్గాలు మరోసారి మండిపడ్డాయి. శవయాత్ర నిర్వహిస్తే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అని మండిపడ్డారు.

లోకేష్‌ను సీఎం చేయాలనుకుంటున్న బాబు, కానీ
ఉత్తరాదిన కాశ్మీర్ నుంచి దక్షిణాదిన ఉన్న కర్ణాటక, తెలంగాణలో వారసత్వ రాజకీయాలున్నాయని, ఏపీ సీఎం చంద్రబాబూ తన కుమారుడు లోకేష్‌కు పట్టాభిషేకం చేయాలనుకోవడం సహజమేనని జేసీ అన్నారు. అయితే ఆ విషయాన్ని ఆయన బయటకు వ్యక్తం చేయడం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నంత కాలం రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదన్నారు.

జేసీ దివాకర్ రెడ్డిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్
మరోవైపు, మహానాడులో ఎరుకల కులస్తులపై జేసీ అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందుకు ఆయనను ఎంపీ పదవి నుంచి తొలగించాలని ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. జేసీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. కర్నూలు జిల్లాలో జేసీకి వ్యతిరేకంగా ధర్నాలు చేశారు.












Click it and Unblock the Notifications