ఏడాది తర్వాత ఒకే వేదికపై జగన్, చంద్రబాబు-గవర్నర్ నజీర్ ప్రమాణం వేళ రాజ్ భవన్లో..
ఏపీ సీఎం వైఎస్ జగన్, విపక్ష నేత చంద్రబాబు దాదాపు ఏడాది విరామం తర్వాత ఒకే వేదికపై ఇవాళ కనిపించారు.
ఏపీ కొత్త గవర్నర్ గా జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని రాజ్ భవన్లో జరిగిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆయనతో ప్రమాణం చేయించారు. దీంతో గవర్నర్ గా నజీర్ బాధ్యతలు చేపట్టినట్లయింది. అయితే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం పలు సంచలనాలకు వేదికైంది. ఇందులో సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబు సుదీర్ఘ విరామం తర్వాత ఒకే కార్యక్రమంలో కనిపించారు.
ఏపీ కొత్త గవర్నర్ ప్రమాణస్వీకారం సందర్భంగా రాజ్ భవన్ లో పలు ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి. సీఎం జగన్ తో పాటు విపక్ష నేత చంద్రబాబు, పలువురు మంత్రులు, అధికారులు, న్యాయమూర్తులు ఇందులో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు సీఎం జగన్ తో కలిసి వేదిక పంచుకోవడం దాదాపు ఏడాది తర్వాత ఇదే తొలిసారి. గత రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ ఎట్ హోం కార్యక్రమానికి చంద్రబాబు హాజరు కాలేదు. కానీ గతేడాది జరిగిన ఎట్ హోంలో మాత్రం సీఎం జగన్ తో పాటు చంద్రబాబు కూడా కనిపించారు. దీంతో ఏడాది విరామం తర్వాత వీరిద్దరూ ఓ కార్యక్రమంలో పాల్గొన్నట్లయింది.

గవర్నర్ ప్రమాణ స్వీకారానికి హాజరైనా చంద్రబాబు, జగన్ మాత్రం ఎదురుపడటం కానీ, పలకరించుకోవడం కానీ జరగలేదు. ఎవరికి వారుగా ఈ కార్యక్రమానికి హాజరుకావడం, వెళ్లిపోవడం జరిగిపోయింది. అలాగే ప్రభుత్వంలో భాగమైన మంత్రులు, అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్ వంటి వారు కూడా ప్రత్యేకంగా తమకు కేటాయించిన స్ధలంలోనే కూర్చున్నారు.

చంద్రబాబువైపు వెళ్లేందుకు వీరితో పాటు అధికార పార్టీకి చెందిన వారెవరూ ఆసక్తి చూపలేదు. అలాగే చంద్రబాబు కూడా వారిని పట్టించుకోకుండానే కార్యక్రమం ముగించుకుని వెళ్లిపోయారు.













Click it and Unblock the Notifications