కప్పట్రాళ్ల హత్య కేసు: పోలీసులకు కీలక నిందితుడు టోకరా
కర్నూలు: కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్య కేసులో కీలక నిందితునిగా ఉన్న దివాకర్‌నాయుడు పోలీసులకు టోకరా ఇచ్చి నెల రోజులుగా కనిపించడం లేదు. కాగా, అతను నక్సల్స్ అనుబంధ సంస్థల్లో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీన్ని పోలీసులు ధృవీకరించడం లేదు. వెంకటప్పనాయుడు హత్యకేసులో 17 మంది నిందితులకు జీవితఖైదు విధిస్తూ ఆదోని సెషన్స్ కోర్టు బుధవారం తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.
ఇదే కేసులో నిందితుడిగా ఉన్న దివాకర్‌నాయుడును పోలీసులు పట్టుకోలేకపోయారు. దివాకర్ నాయుడు పరారీపై ఆదోని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దివాకర్ నాయుడును అరెస్టుచేసి హాజరుపరచాలని కోర్టు ఆదేశిస్తూ అతనిపై తీర్పును రిజర్వులో ఉంచింది. కప్పట్రాళ్ల కేసులో శిక్ష ఖాయమని భావించిన దివాకర్ నాయుడు గత నెల రోజులుగా కనిపించడం లేదని పోలీసులు అంటున్నారు.

కర్నూలు నగరానికి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన నక్సల్ సానుభూతిపరుల సహకారంతో దివాకర్‌నాయుడు నక్సలైట్లకు చేరువైనట్లు సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు అంగీరించడం లేదు. దివాకర్ నాయుడు ఆగడాలు ఆ గ్రామస్థులకు తెలుసునని, అలాంటి అతడ్ని ప్రోత్సహించే అవకాశాలు లేవని అంటున్నారు. వెంకటప్ప నాయుడు హత్య తర్వాత బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్ వంటి నేరాలకు పాల్పడిన దివాకర్‌నాయుడు పెద్దమొత్తంలో ఆస్తులు కూడబెట్టాడని పోలీసులు వెల్లడిస్తున్నారు.
గత ఎస్పీ రఘురామిరెడ్డి తనిఖీల్లో ఈ విషయం వెల్లడైందని వారంటున్నారు. ఆస్తులను సొంతం చేసుకున్న దివాకర్ విలాసవంతమైన జీవితం గడిపే అవకాశమెక్కువగా ఉందని పోలీసులు భావిస్తున్నారు. నాయుడు ఒంటరిగా అడవుల్లో ఉండటానికి ఇష్టపడడని అంటున్నారు. వెంకటప్పనాయుడు హత్య కేసులో శిక్ష పడుతుందన్న భయంతో ప్రస్తుతం అజ్ఞాతంలో వెళ్లినా కొంతకాలం తరువాత ఎక్కడో ఒక చోట తమకు చిక్కకపోతాడా అనే ధీమాతో ప్రత్యేక పోలీసు బృందాలను నియమించారు. గాలింపుచర్యలు ముమ్మరం చేశారు.












Click it and Unblock the Notifications