ఏపీకి షాక్: తెలంగాణ విషయంలోకి మమ్మల్ని లాగొద్దని కర్ణాటక
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) వివాదం ఇప్పట్లో తేలేలాలేదు. ఆర్డీఎస్ ఎత్తు పెంచేందుకు తెలంగాణ యత్నిస్తుండగా, దానిని అడ్డుకునేందుకు ఏపీ శతవిధాలా యత్నిస్తోంది.
తన విజ్ఞప్తులను పెడచెవిన పెడుతున్న తెలంగాణ సర్కారుకు పరోక్షంగా షాకిద్దామని భావిస్తున్న ఏపీకి మంగళవారం కర్ణాటక నుంచి పెద్ద షాకే తగిలింది. కర్ణాటక సరిహద్దులో ఉన్న ఆర్డీఎస్‌పై ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి పనులు నిలిపివేయించాలని ప్లాన్ వేసిన ఏపీ ప్రభుత్వం.. జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావును మంగళవారం బెంగళూరు పంపింది.

ఈ క్రమంలో కర్ణాటక జలవనరుల శాఖ కార్యదర్శి గురుపాద స్వామితో వెంకటేశ్వరరావు చర్చలు జరిపారు. అయితే ఆయన ప్రతిపాదనలకు గురుపాదస్వామి పెద్దగా స్పందించలేదు.
అయినా ఆర్డీఎస్ సమస్య తెలుగు రాష్ట్రాలకు చెందినదని, ఇందులో తమ ప్రమేయం ఉండబోదని ఆయన తేల్చేశారు. 'మీ(తెలంగాణ, ఏపీ) మధ్య సమస్యను... మీకు మీరే తేల్చుకోండి. మమ్మల్ని ఇందులోకి లాగొద్దు' అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో వెంకటేశ్వరరావు నిరాశగా వెనుదిరిగినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications