జానా చెప్పింది వంద శాతం కరెక్ట్.. కానీ నేనే: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం సమష్టి కృషితో వచ్చిందన్న కాంగ్రెసు పార్టీ శాసన సభా పక్ష నేత జానా రెడ్డి వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని, తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొన్నారని, అందువల్లే సాధ్యమైందని, అది వంద శాతం నిజమని, అయితే ఈ దఫా ఉద్యమానికి సృష్టికర్తను మాత్రం తానేనని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం అసెంబ్లీలో అన్నారు. గవర్నర్ ప్రసంగంపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా జానా రెడ్డి మాట్లాడారు.
క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు తమ ప్రభుత్వ హయాంలో చట్టబద్ధత తీసుకొచ్చామని, దాన్ని ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి కోరారు. ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్లు, పక్కా ఇళ్ల నిర్మాణం తదితర అంశాలపై స్పష్టత లేదన్నారు. దీనిపై కెసిఆర్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ వచ్చిందుకు సభలో సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెబితే బాగుండేదని జానా రెడ్డి అన్నారు. గిరిజనులకు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల పైన స్పష్టత ఇవ్వాలన్నారు. తెలంగాణ అభివృద్ధికి కాలపరిమితితో కూడిన ప్రణాళిక అవసరమన్నారు. తెలంగాణలో అందరికీ మంచి జరగాలన్నారు. తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజల విజయమే అన్నారు. ఏ ఒక్కరిదీ కాదన్నారు. తెలంగాణలో ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలన్నారు.
అనంతరం కెసిఆర్ మాట్లాడారు. సోనియా చొరవ వల్లనే తెలంగాణ వచ్చిందని, బిజెపి సహకరించిందని, అందుకు ఇరు పార్టీలకు ధన్యవాదాలు అని తెలిపారు. రాజ్ నాథ్ సింగ్ చొరవతో బిజెపి తెలంగాణ ఏర్పాటుకు సహకరించిందన్నారు. ఏ ఒక్కరి వల్ల తెలంగాణ ఏర్పడలేదన్న జానా వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. అది వంద శాతం నిజమన్నారు. ఈ దఫా ఉద్యమానికి సృష్టికర్తను తానే అన్నారు.
గతంలో చాలామంది తెలంగాణ కోసం ఉద్యమించారన్నారు. ఈ దఫా ఉద్యామానికి మాత్రం తాను నాయకత్వం వహించానని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొన్నారని, బిల్లుకు 33 పార్టీలు మద్దతిచ్చాయన్నారు. ఈ విజయం ఏ ఒక్కరిదో కాదని, తెలంగాణ యావన్మందిది అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా తాను అందరికీ శిరస్సు వంచి నమస్సులు తెలియజేస్తున్నానని తెలిపారు.
ప్రజలు కోరుకున్న బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని చెప్పారు. జానా రెడ్డి కరెక్టుగా చెప్పారని.. తెలంగాణ రాష్ట్ర పునర్ నిర్మాణం తమ వల్లే సాధ్యమవుతుందని తాము భావించడం లేదని, అన్ని పార్టీల సహకారంతోనే సాధ్యమవుతుందని తాము నమ్ముతున్నామన్నారు. అందరం రాజకీయ విభేదాలు పక్కన పెట్టి కలిసి అభివృద్ధి చేసుకుందామన్నారు. దేశం మొత్తం ఔరా అనిపించేలా అభివృద్ధి చేసుకుందామన్నారు. అన్ని పార్టీలను తాము పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు.
జానా ఇచ్చిన పలు సూచనలను సహృదయంగా స్వీకరిస్తున్నామన్నారు. తాము రాజకీయ అవినీతిని అంతం చేస్తామంటే.. కేవలం రాజకీయ అవినీత కాదు అంతా చేయాలని జానా సరిగా చెప్పారన్నారు. అయితే రాజకీయ అవినీతి అంతమైతే అంతా పోతుందని కెసిఆర్ అన్నారు.
అలాగే రిజర్వేషన్ల పైన స్పష్టత కోరారని, దానిపై పూర్తి కసరత్తు చేశాకే హామీ ఇచ్చామన్నారు. అలాగే అమరవీరుల కుటుంబాలకు ఎంత ఇచ్చినా తక్కువే అన్నారు. అలాగే కాంగ్రెస్ నేతలు చెప్పనట్లు 1969 తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలను కూడా ఆదుకుంటామన్నారు. రాష్ట్ర సాధనకు కారణమైన ఇప్పటి ఉద్యమానికి ఊపిరేత 1969 ఉద్యమం అన్నారు.
కేవలం పంట రుణాలే కాకుండా.. బంగారం పెట్టి తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేస్తామని చెప్పారు. రైతులకు కచ్చితంగా పంట రుణాలు మాఫీ చేస్తామన్నారు. పంట రుణాల మాఫీ వల్ల రూ.19 కోట్ల భారం పడనుందన్నారు. బీడీ కార్మికులను ఆదుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలను తాము సాధిస్తామని చెప్పారు. కొత్త రాష్ట్రంలో పాత అరాచకాలకు తావు ఉండదన్నారు.












Click it and Unblock the Notifications