చిక్కుల్లో కెసిఆర్, ఆత్మరక్షణ: ముప్పేట ప్రతిపక్షాల దాడి

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చిక్కుల్లో పడినట్లు కనిపిస్తున్నారు. కెసిఆర్ ప్రతిపక్షాలకు సందు ఇవ్వరని అనుకుంటున్న సమయంలో ఆయన పలు సమస్యల్లో చిక్కుకున్నట్లు కనిపిస్తున్నారు. దాంతో ప్రతిపక్షాలు ఆయనపై ముప్పేట దాడి చేస్తున్నాయి. తెలుగుదేశం, కాంగ్రెసు, సిపిఐ తెలంగాణ నాయకులు ఆయనపై విరుచుకుపడుతున్నారు. మంత్రివర్గం నుంచి రాజయ్య ఉద్వాసనపై ధ్వజమెత్తుతూ వచ్చిన ప్రతిపక్షాలు తాజాగా చెస్ట్ ఆస్పత్రిని తరలించాలనే నిర్ణయంపై విరుచుకుపడుతున్నాయి.

నిజానికి, కెసిఆర్ శుక్రవారంనాటి మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో కెసిఆర్ చాలా క్లుప్తంగా మాట్లాడారు. గతంలో అయితే మీడియా సమావేశాల్లో ప్రత్యర్థులపై తనదైన శైలిలో వాగ్బాణాలు వదులుతూ ఉండేవారు. కానీ, శుక్రవారం రాత్రి మీడియా సమావేశంలో ఆయన అంత చురుగ్గా కనిపించలేదు. అయితే, ఏడు గంటల పాటు మంత్రివర్గ సమావేశం సుదీర్గంగా సాగడంతో ఆయన అలసిపోయి కూడా ఉంటారు. అది కూడా అందుకు కారణం కావచ్చు.

కాగా, ఫాస్ట్ పథకాన్ని వెనక్కి తీసుకోవడం నైతికంగా కెసిఆర్‌కు దెబ్బ అనే మాట వినిపిస్తోంది. ఫీజు రీయంబర్స్‌మెంట్‌ కోసం స్థానికతను గుర్తించి, తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ఫీజు చెల్లించడానికి ఆ ఫాస్ట్‌ను తీసుకుని వచ్చారు. అయితే, దానిపై ఆంధ్రప్రదేశ్ నాయకుల నుంచే కాకుండా తెలంగాణ ప్రతిపక్షాల నేతల నుంచి కూడా వ్యతిరేకత ఎదురైంది. చివరకు, కోర్టు ఆ పథకంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ పథకాన్ని ముందుకు తెచ్చిన తెలంగాణ ప్రభుత్వంపై కూడా విరుచుకుపడింది. దీంతో న్యాయస్థానాల్లో నిలువలేదనే ఉద్దేశంతో ఫాస్ట్‌ను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్లు కనిపిస్తోంది. స్థానికతను నిర్ణయించడానికి 371డి నిబంధనను ప్రామాణికంగా తీసుకోవాలని మంత్రివర్గ నిర్ణయించింది.

K Chandrasekhar Rao

ఉప ముఖ్యమంత్రి రాజయ్యను తొలగించడం కూడా ఆయనకు చిక్కులను తెచ్చి పెట్టింది. బైండ్ల కులానికి చెందిన కడియం శ్రీహరిని ఆయన స్థానంలో తేవడం ద్వారా విమర్శల నుంచి బయటపడాలని అనుకున్న కెసిఆర్‌కు అంత సానుకూల పరిస్థితి ఏర్పడలేదు. తెలుగుదేశం పార్టీ మాదిగ వర్గం నేత మోత్కుపల్లి నర్సింహులు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు మందకృష్ణ మాదిగ నిత్యం కెసిఆర్‌పై విరుచుకుపడుతున్నారు. మాదిగలకు వ్యతిరేకంగా కెసిఆర్ పనిచేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. వారిని తాజా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాత్రమే ఎదుర్కుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నేతలు గానీ మంత్రులు గానీ ఆ విషయంలో తెర మీదికి రావడం లేదు. కెసిఆర్ సూచనల మేరకే వారు మాట్లాడడం లేదా, అందుకు మరేదైనా కారణం ఉందా తెలియదు.

కాగా, చెస్ట్ ఆస్పత్రిని తరలించి, ఆ స్థానంలో సచివాలయాన్ని నిర్మించాలనే కెసిఆర్ నిర్ణయంపై అన్ని పార్టీల నుంచి విమర్శలు వస్తున్నాయి. వాస్దు భయంతో కెసిఆర్ సచివాలయాన్ని మార్చాలనుకోవడం మరింతగా విమర్శలకు తావు ఇస్తోంది. కెసిఆర్ భయపడుతున్నారా అనే అనుమానాలను ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆంధ్ర నేతలు పదవులు కోల్పోయారు, తాను కూడా పదవి కోల్పోతాననే భయంతో కెసిఆర్ సచివాలయాన్ని మారుస్తున్నారని టిడిపి నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తన ఆలోచలన్నీ చట్టాలుగా మారాలని కెసిఆర్ కోరుకుంటున్నారని సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. కెసిఆర్ ఒంటెత్తు పోకడలు మానుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.

షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్ వంటి కాంగ్రెసు నాయకులు చెస్ట్ ఆస్పత్రి తరలింపు నిర్ణయంపై కెసిఆర్‌పై తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. ఎన్టీఆర్ వెన్నుపోటు భయం కెసిఆర్‌కు పట్టుకున్నట్లుందని ఓ నాయకుడు వ్యాఖ్యానించారు. బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చినప్పుడు కెసిఆర్ ఇంతకు ముందు ధీటుగా జవాబిచ్చేవారు. ఇప్పుడు మాత్రం ఆయన ఏమీ మాట్లాడడం లేదు. మౌనం వహిస్తున్నారు. నిజాం గుర్తుగా కట్టుకున్న చోట్ల కెసిఆర్ భవనాలు ఎందుకు నిర్మించాలని అనుకుంటున్నారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఆంధ్రవాళ్లు వెళ్లిపోయిన తర్వాత సచివాలయమంతా ఖాళీ అవుతుంది కదా అని ఆయన శనివారంనాడు అన్నారు. కెసిఆర్ తొందర పాటు నిర్ణయాల వల్లనే ఎదురుదెబ్బలు తగులుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు.

కాగా, వాస్తుపై అపారమైన విశ్వాసం, మొక్కులు తీర్చడం మీద శ్రద్ధ కూడా కెసిఆర్‌పై వ్యాఖ్యలు చేయడానికి కారణాలవుతున్నాయి. కాగా, తాను చేయదలుచుకున్న పనులు కూడా అంత వేగంగా జరుగుతున్న సూచనలు కెసిఆర్‌కు కనిపించడం లేదని అంటున్నారు. ప్రజల కోసం ఆయన పలు కార్యక్రమాలు చేపట్టాలని అనుకున్నారు. వాటి గురించి పలు సందర్భాల్లో ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా చెప్పారు. కానీ, ఆ పథకాలు ఎలా సాగుతున్నాయో చెప్పడానికి, ప్రజల వద్దకు తీసుకుని వెళ్లడానికి సరైన యంత్రాంగం గానీ వ్యవస్థ గానీ కెసిఆర్ వద్ద ఉన్నట్లు లేదు. తమ శాఖల వ్యవహారాల గురించి మాట్లాడడానికి మంత్రులకు కూడా స్వేచ్ఛ లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మహమ్మారి కూడా సమస్యగా మారింది. స్వైన్ ఫ్లూతో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 27 మంది మరణించినట్లు అధికారులే చెబుతున్నారు. దీన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందడం లేదనే మాటలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, బిజెపి కేంద్ర ప్రభుత్వంపై కెసిఆర్ ఘర్షణ వైఖరిని అనుసరించడం కూడా సమస్యగా మారిందని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందనే మాట వినిపిస్తోంది. దీనివల్ల కూడా కెసిఆర్‌కు ఇబ్బంది ఏర్పడిందని అంటున్నారు.

గతంలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ను కెసిఆర్ హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. రుణ మాఫీ విషయంలో చేసిన ప్రకటన వివాదం కావడంతో ఆయన నోటికి తాళం వేసినట్లు చెప్పారు. తాజాగా, కడియం శ్రీహరిని కూడా కెసిఆర్ హెచ్చరించినట్లు ప్రచారం సాగుతోంది. కెజీ నుంచి పిజి వరకు ఉచిత విద్య అనేది తన ప్రతిపాదనే అని అన్నందుకు ఆయన కడియం శ్రీహరిని హెచ్చరించినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రాజయ్యను కూడా పలుమార్లు ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండగా హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, మంత్రులు కెసిఆర్ ఆలోచనలను పట్టుకోలేకపోతున్నారా, ఆయన ఆశించిన మేరకు పని చేయలేకపోతున్నారా అనేది కూడా ప్రశ్నార్థకంగానే మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+