పార్టీకి, పదవికి రాజీనామా!: కిరణ్, నా వల్లే ఇంకా ఇలా..

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి తన పార్టీ, కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పే పరిస్థితి రావొద్దనేదే తన ఆందోళన అని, సమైక్య రాష్ట్రం కోసం తాను పార్టీకి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం చెప్పారు. రాష్ట్రాన్ని విభజించినందుకు తన పార్టీ, కేంద్ర ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి రావొద్దని ఆయన అన్నారు.

అందుకే విభజన వద్దని చెబుతున్నానని తెలిపారు. బుధవారం ఆయన ఓ జాతీయ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. తాను విభజనను ఎందుకు వ్యతిరేకిస్తున్నానో చెప్పారు. అసెంబ్లీ తిరస్కరించిన తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకోవాలనే విజ్ఞప్తితో, అలాంటి బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టకూడదన్న డిమాండ్‌తో ఢిల్లీలో మౌనదీక్ష చేశామన్నారు.

Kiran Kumar Reddy

ఈ బిల్లుపై ముందుకు వెళ్లకూడదని పదేపదే కోరుతున్నామని, తనకు పదవి ముఖ్యం కాదనే విషయాన్ని విభజన ప్రకటన చేసిన 150 రోజుల తర్వాత స్పష్టంగా చెప్పానని, మొదటి నుండి సమైక్యాంధ్ర కోసం గట్టిగా నిలబడి ఉన్నానని చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. దాని కోసం తన పదవినైనా వదులుకోవడానికి సిద్ధమని కిరణ్ వివరించారు.

తన భవిష్యత్తు కన్నా రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమన్నారు. విభజన రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలకూ విపత్తు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తాను గానీ తన పదవిగానీ శాశ్వతం కాదని, రాష్ట్రం, ప్రజలే శాశ్వతమని, ప్రజల అభిమతాన్ని తాను ప్రతిబింబిస్తున్నానని చెప్పారు. పదవులు శాశ్వతం కాదని సమైక్యమే ముఖ్యమని కిరణ్ వివరించారు.

పార్టీ ఏర్పాటనేది సమస్యే కాదని అలాంటి అంశాలపై దృష్టి సారించవద్దన్నారు. కేంద్ర మంత్రులు కూడా తనతో పాటు రాష్ట్రపతిని కలిసి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరినట్లు చెప్పారు. విభజన అన్ని ప్రాంతాలకూ నష్టదాయకమని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోసమే పనిచేయాలి తప్ప పదవుల కోసం కాదని వ్యాఖ్యానించారు. గతంలో అనేక విధానపరమైన నిర్ణయాలు తీసుకుని, తర్వాత క్షమాపణ చెప్పాల్సి వచ్చిందని, ఆ పరిస్థితి ఇక్కడ రాకూడదని అన్నారు.

రాష్ట్ర సమైక్యత కోసం తాము దేనికైనా సిద్ధమే అన్నారు. తాను ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నందువల్లే ఎపిలో పరిస్థితి ఇంకా ఇలా ఉందని, తాను లేకుంటే విభజన ప్రక్రియ ఎప్పుడో పూర్తయ్యేదన్నారు. కేంద్రం వినకపోతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కేంద్రమంత్రులతో మాట్లాడుతానని చెప్పారు. తామంతా ఈ పోరాటంలో కలిసే ఉన్నామన్నారు. పార్టీ ఏర్పాటు చేయడం, రాజీనామా చేయడం ఇవన్నీ చిన్న విషయాలని, సమైక్యత ముఖ్యమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+