కురుపాం టీడీపీ అభ్యర్థి తోయక జగదీశ్వరి భర్తపై ఈసీ వేటు..ఎందుకంటే..?
దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ మే 16వ తేదీ నుంచి అమలులో ఉంది. ఎప్పుడైతే ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసిందో ఆ నిమిషం నుంచే కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు గానీ, రాజకీయ పార్టీలు గానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ వీరందరిపై కేంద్ర ఎన్నికల సంఘం నిఘా పెంచింది. ఎన్నికల నిబంధనలు లేదా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినట్లు కనిపించినా లేదా అనిపించినా అట్టి పార్టీలు లేదా వ్యక్తులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో సహించేదిలేదని తేల్చి చెబుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికల సంఘం నేతృత్వంలో పోలీసులు నిఘా పెంచారు. పలు చోట్ల చెక్‌పోస్టులు పెట్టి వచ్చిపోయే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానంగా ఏదైనా కనపడినా... క్షుణ్ణంగా తనిఖీలు చేసి అంత సవ్యంగా ఉంటేనే వదులుతున్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న ఎంతటి వారైనా సరే ఎంత పెద్ద రాజకీయనాయకుడైనా సరే వదలడం లేదు. పూర్తి విచారణ తర్వాతే వ్యక్తులు ఇచ్చిన సమాధానాలతో సంతృప్తి చెందితేనే వదులుతున్నారు. లేదంటే వాహనాలను సీజ్ చేస్తున్నారు.

తాజాగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి తోయక జగదీశ్వరి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. ఆమె భర్త సన్యాసినాయుడు ప్రభుత్వ ఉద్యోగి. దీంతో ఆయన నివాసముంటున్న ప్రభుత్వ కార్టర్స్‌లో ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి చేరికలు జరిగాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ క్వార్టర్స్‌లో జాయినింగ్స్ నిర్వహించడం ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లింది. వెంటనే రంగంలోకి దిగిన ఎన్నికల సంఘం చేరికలకు సంబంధించిన ఫోటోలను పరిశీలించినట్లు తెలుస్తోంది. అనంతరం తోయక జగదీశ్వరిపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ప్రభుత్వ క్వార్టర్స్‌లో పార్టీ చేరికలు చేపట్టినందుకు, అందుకు ప్రోత్సహించినందుకు ప్రభుత్వ ఉద్యోగి తోయక జగదీశ్వరి భర్త అయిన అడ్డాకుల సన్యాసి నాయుడిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఇంఛార్జ్ జిల్లా రెవిన్యూ అధికారి జి.కేశవ నాయుడు ధృవీకరించారు. ఎన్నికల అధికారి ఇచ్చిన రిపోర్ట్ మేరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు కేశవనాయుడు వెల్లడించారు.












Click it and Unblock the Notifications