జస్ట్ బెంగళూరు థింగ్స్: కార్లు కడిగితే భారీగా ఫైన్
దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోంది. నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యంగానైనా కేరళ తీరాన్ని తాకినప్పటికీ ఆ తర్వాత వాటి కదలికలు మందగించాయి. ఉత్తరాదిన చెప్పుకోదగ్గ వర్షాలు పడుతున్నప్పటికీ.. దక్షిణాదిలో వాటి జాడే కరవైంది. బంగాళాఖాతంలో ఏర్పడుతోన్న ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో అడపాదడపా వర్షాలు పడుతున్నా.. ఈ లోటు భర్తీ కావట్లేదు. దక్షిణాది రాష్ట్రాలన్నింట్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
ఈ పరిణామాల మధ్య కర్ణాటక ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. బెంగళూరులో రాబోయే రోజుల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు బెంగళూరు జలమండలి నూతన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఎల్ నినో ప్రభావం వల్ల రుతుపవన వర్షాలలో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం ఉండటం వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకుంది. నగర వ్యాప్తంగా తాగునీటి వనరులను కాపాడుకోవడమే లక్ష్యంగా తక్షణ ఆదేశాలను ఇచ్చింది.

వర్షపాతం తగ్గినా లేదా ఆలస్యమైనా నగరవాసులకు తాగునీటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో ఈ రక్షణాత్మక చర్యలు చేపట్టింది. నీటిని పొదుపుగా వినియోగించాలని సూచించింది. గృహాలు, వ్యాపార సముదాయాలు, ప్రభుత్వ/ప్రైవేట్ సంస్థలను ఈ నిబంధనల పరిధిలోకి వచ్చాయి. వాహనాలు కడగడానికి అనుమతి లేదు. రోడ్లు, ఫుట్‌పాత్‌లను శుభ్రం చేయడానికి నీటిని వినియోగించడాన్ని పూర్తిగా నిషేధించారు.
పబ్లిక్/ ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్‌లో తాగునీటిని నింపడంపై కూడా కఠినమైన ఆంక్షలు విధించారు. వీటికి ప్రత్యామ్నాయంగా రీసైకిల్ లేదా శుద్ధి చేసిన నీటిని మాత్రమే వాడాల్సి ఉంటుంది. తోటల పెంపకం, భవన నిర్మాణ రంగ కార్యకలాపాలకు కూడా ఈ రీసైకిల్ నీటినే ఉపయోగించాలి. నిబంధనలు ఉల్లంఘించి తాగునీటి పైపులను సాధారణ పనుల కోసం ఉపయోగిస్తే జలమండలి నిఘా బృందాలు చర్యలు చేపడతాయి.
నీటిని పొదుపుగా వాడుకునేందుకు వీలుగా, భవనాల్లోని నీటి కనెక్షన్లకు ప్రవాహాన్ని నియంత్రించే ఏరేటర్లను (ఫ్లో రెస్ట్రిక్టర్లు) అమర్చాలి. ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య కట్టడాలు, కార్యాలయాలు, హోటళ్లు, పరిశ్రమలు తమ నల్లాలకు ఈ ఏరేటర్లను అమర్చుకోవాలని బెంగళూరు వాటర్ బోర్డు స్పష్టం చేసింది. వీటిని వాడటం వల్ల నీటి వినియోగం సుమారు 30 నుండి 50 శాతం వరకు తగ్గుతుందని, ఇది నీటి నిల్వలను సుదీర్ఘ కాలం పాటు కాపాడుకోవడానికి ఎంతో సహాయపడుతుందని జలమండలి చైర్‌పర్సన్ డాక్టర్ మంజుల తెలిపారు.
జలమండలి జారీ చేసిన ఈ కొత్త నిబంధనలను ఉల్లంఘించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. ఈ నిబంధనలను మొదటిసారి ఉల్లంఘించినట్లు తేలితే సదరు వ్యక్తులు లేదా సంస్థలకు రూ. 5,000 వరకు జరిమానా విధిస్తారు. బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ యాక్ట్, 1964 చట్టంలోని నిబంధనల ప్రకారం, ఆయా ప్రాంగణాలకు బోర్డు సరఫరా చేసే తాగునీటి పరిమాణాన్ని కూడా ఏకంగా 50 శాతం వరకు తగ్గించే అవకాశం ఉంది. జరిమానా తర్వాత కూడా నిబంధనలను ధిక్కరిస్తే వారిపై రోజుకు అదనంగా రూ. 500 చొప్పున పెనాల్టీ విధిస్తారు. క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని జలమండలి బోర్డు స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications