తెలంగాణాలో 2లక్షల మందికి ఉపాధి కల్పించే భారీ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ.. అక్కడే!
తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ ప్రాంతంలో 3245 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఇండస్ట్రియల్ పార్క్ సిటీని అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 15 వేల కోట్లు పెట్టుబడులను ఆకర్షించి, ప్రత్యక్షంగాను, పరోక్షంగాను రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి శ్రీధర్ బాబు
ఇక ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఈ వివరాలను వెల్లడించారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ మరియు ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొన్నారు. కాన్ఫరెన్స్ అనంతరం ఈ వివరాలను వెల్లడించారు.

జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులపై మంత్రి వ్యాఖ్యలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ పురోగతిపైన మాట్లాడారు. మంత్రి శ్రీధర్‌బాబు చెప్పిన వివరాల ప్రకారం, జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులను 2028 మార్చి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం భూమి రూపంలో 51 శాతం వాటా
ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ విధానంలో పనులు కొనసాగుతున్నాయన్నారు. ఇప్పటికే స్పెషల్ పర్పస్ వెహికల్ కి ప్రణాళిక అందించినట్టు ఆయన వెల్లడించారు. నీటి సరఫరా పనులకు సంబంధించిన టెండర్లు పూర్తయ్యాయని. విద్యుత్ సౌకర్యాలు కూడా నిర్ణీత గడువులోగా అందుబాటులోకి తీసుకువస్తాయని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.ఈ ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం భూమి రూపంలో 51 శాతం వాటా కలిగి ఉందన్నారు.
జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి కేంద్ర నిధులు
అభివృద్ధికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం అందిస్తోందని ఆయన వెల్లడించారు. దీని వల్ల జహీరాబాద్ ప్రాంతం భవిష్యత్తులో ముఖ్యమైన పారిశ్రామిక కేంద్రంగా మారే అవకాశం ఉందని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తెలిపారు . అదే సమావేశంలో కేంద్రం ప్రకటించిన భవ్య పథకం కింద ఏర్పాటు చేయనున్న 100 ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కుల్లో నాలుగింటిని తెలంగాణకు కేటాయించాలని కూడా మంత్రి శ్రీధర్‌బాబు కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కోరారు.
తెలంగాణకు నాలుగు పార్కులు కేటాయిస్తే తెలంగాణ పారిశ్రామికంగా అభివృద్ధి
ప్లగ్ అండ్ ప్లే విధానం వల్ల మౌలిక వసతులు త్వరగా అందుబాటులోకి వచ్చి, పరిశ్రమలు వేగంగా కార్యకలాపాలు ప్రారంభించగలుగుతాయని, ఇందులో తెలంగాణకు నాలుగు పార్కులు కేటాయిస్తే తెలంగాణ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. జహీరాబాద్ స్మార్ట్ సిటీతో పాటు ఇలాంటి పారిశ్రామిక ప్రాజెక్టులు రాష్ట్రంలో పెట్టుబడులు పెంచడంతో పాటు వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.













Click it and Unblock the Notifications