రెండు రోజుల్లో 19 మంది దుర్మరణం.. కల్తీ మద్యం కలకలం..
ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ లో కల్తీ మద్యం పంజా విసిరింది. కల్తీ మద్యం తాగి 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. పోలీసులు 3,200 సీసాల కల్తీ మద్యాన్ని సీజ్ చేశారు. మోకోక్ చంగ్ జిల్లాలో 8 మంది దుర్మరణం చెందగా టుయన్ సాంగ్ జిల్లాలో 11 మంది కల్తీ మద్యానికి బలయ్యారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటివరకూ అనేక మందిని అరెస్ట్ చేశారు. ఫేక్ లిక్కర్ పై ఉక్కుపాదం మోపేందుకు సమగ్రమైన దర్యాప్తు నిర్వహిస్తున్నారు. నాగాలాండ్ లో గతకొంత కాలంగా కల్తీ మద్యం తాగి అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఈ మరణాలు అధికం అయ్యాయి.
గతంలోనే దాదాపు 450 కు పైగా కల్తీ మద్యం సీసాలను అధికారులు సీజ్ చేశారు. అందులో ప్రమాదకరమైన మిథనాల్ కెమికల్ ఉన్నట్లు గుర్తించారు. మిథనాల్ కెమికల్ ను ఉపయోగించి కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇక ఇప్పటివరకూ 3 వేలకు పైగా కల్తీ మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు ఈ ఘటనపై నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సిట్ దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసింది. ఇక కల్తీ మద్యం సేవించి మృతి చెందిన వారి మృత దేహాలను అధికారులు ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం గువాహటికి పంపించారు. మరోవైపు అధికారిక లెక్కల ప్రకారం 19 మంది కల్తీ మద్యానికి బలయ్యారని పోలీసులు వెల్లడిస్తున్నా అనధికార లెక్కల ప్రకారం ఓ 50 మంది వరకు కల్తీ మద్యం కారణంగా మృతి చెంది ఉంటారని స్థానికులు వెల్లడించిన సమాచారం బట్టి తెలుస్తోంది.

ఇక నాగాలాండ్ లో కల్తీ మద్యం మరణాలపై రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ లా అండ్ ఆర్డర్ సందీప్ ఎం టామ్ గాడ్జ్ మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. " గత రెండు వారాల వ్యవధిలోనే ఈ మరణాలు సంభవించాయి. మొదటి మరణం నుంచి నాగాలాండ్ పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తును చేపట్టారు. ప్రస్తుతం విచారణ వేగవంతం అవుతోంది. ఇప్పటికే ఈ కల్తీ మద్యానికి సంబంధించి చాలామందిని అరెస్ట్ చేశాం. 1999 నుంచే నాగాలాండ్ లో కల్తీ మద్యం నిషేధం అమల్లో ఉంది. అక్రమార్కులను ఏమాత్రం ఉపేక్షించేది లేదు" అని తెలిపారు.












Click it and Unblock the Notifications
