ఏపీలోని ఈ జిల్లాల్లో నేడు వర్షాలు పడే ఛాన్స్- వాతావరణంలో మార్పులు
ఏపీలో నేడు పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కావొచ్చు. ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని, వాతావరణ మార్పుల వల్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని సూచించింది.
ప్రత్యేకించి.. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పోలవరం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి. వీటితో పాటు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి జల్లులు పడొచ్చు. ఆయా జిల్లాల్లో అప్పటికప్పుడు వాతావరణంలో మార్పులు సంభవించవచ్చని, బలమైన ఈదురుగాలులు వీస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది.

ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ పరిధిలోని పలు జిల్లాల్లోనూ చల్లటి వాతావరణం నెలకొంటుంది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, కృష్ణా, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుండి మోస్తరు వర్షాలు కురిసే వీలుంది. అదేవిధంగా రాయలసీమలోని అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ వాతావరణంలో మార్పులు సంభవించి, వర్షాలు పడతాయని ఎస్డీఎంఏ పేర్కొంది.
వర్షాలతో పాటు పిడుగులు పడే ముప్పు కూడా పొంచి ఉండటంతో గ్రామీణ ప్రాంత ప్రజలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో చెట్ల కిందకు చేరవద్దని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్దకు వెళ్లొద్దని అన్నారు.
రోడ్లపై నీరు నిలిచే అవకాశం ఉన్నందున వాహనాలను నెమ్మదిగా నడపాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తోన్నారు. వాతావరణంలో చోటుచేసుకుంటున్న ఈ ఆకస్మిక మార్పుల వల్ల అంటువ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఉంది. ప్రతి ఒక్కరూ కాచి వడపోసిన నీటిని తాగాలని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications