ఎంపీ PA నంటూ నిరుద్యోగులకు బురిడీ.. జనసేన ఎంపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
జనసేన పార్టీకి చెందిన నేత, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ బాలశౌరి అనుచరుడు గరికపాటి శివ, పీఏ గోపాల్ సింగ్ లు నిరుద్యోగులకు టోకరా వేసినట్లు సమాచారం. ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల వద్ద రూ. లక్షల్లో నగదు వసూలు చేసి మోసం చేశారని బాధితులు ఎంపీ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు.
మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పీఏ గోపాల్ సింగ్, అనుచరుడు గరికపాటి శివ.. నిరుద్యోగులను మోసం చేసినట్లు సమాచారం. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి దాదాపు కోటిన్నర రూపాయలు వరకూ వసూలు చేసినట్లు తెలుస్తోంది. 60 మంది వద్ద రెండు లక్షల చొప్పున వసూలు చేశారట గోపాల్ సింగ్. బందరులోని మెడికల్ కాలేజీ, కృష్ణ యూనివర్సిటీ, విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బు వసూలు చేశారని నిరుద్యోగ కుటుంబాలు తెలిపాయి. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.
గతంలో ఫేక్ అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చాడు ఎంపీ పీఏ గోపాల్‌సింగ్. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అపాయింట్‌మెంట్ లెటర్ల గడువు ముగిసిందని మాయమాటలు చెప్పి తప్పించుకున్నాడు. ఆ తర్వాత విజయవాడలోని నోవాటెల్ కు వస్తే మళ్లీ కొత్తగా అపాయింట్‌మెంట్ లెటర్లు ఇస్తానని గోపాల్ సింగ్ చెప్పాడు.

నిజమేనని నమ్మిన నిరుద్యోగ కుటుంబాలు.. ఆగస్టు 1న నోవాటెల్ హోటల్ కు వెళ్లగా.. అక్కడకు గోపాల్ సింగ్ రాలేదు. ఈ క్రమంలో తాము మోసపోయామని గుర్తించిన బాధితులు.. తమకు న్యాయం చేయాలంటూ ఎంపీ బాలశౌరి కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.












Click it and Unblock the Notifications