కూతురిపై అల్లుడి వేధింపులు చూడలేక తండ్రి ఆత్మహత్య
ఖమ్మం: కుమార్తెను అల్లుడు వేధించడం చూసి తట్టుకోలేక ఓ తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలోని గోపాలపురంలో చోటు చేసుకుంది. జరిగిన ఈ ఘటనతో ఆగ్రహించిన అతని బంధువులు మృతదేహంతో రాస్తారోకో చేపట్టారు.
భార్యను వేధించి మామ మరణానికి కారణమైన అల్లుడిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాస్తారోకో ఆందోళనతో వైరా రోడ్డుపై కిలోమీటర్ వరకు వాహనాలు స్తంభించాయి.
భార్యను నరికి చంపిన భర్త

వరంగల్: మంగపేట మండలం బోర్ నర్సాపురంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో పూనెం నర్సయ్య అనే వ్యక్తి తన భార్య స్వరూపాను శుక్రవారం కత్తితో నరికి చంపాడు. గ్రామస్తులు, బంధువుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పూనెం నర్సయ్య, స్వరూప(46)లు కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటారు.
గత కొన్నేళ్లుగా నరసయ్య మద్యానికి బానిసై భార్య స్వరూపను నిత్యం వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో భర్త వేధింపులకు భార్య స్వరూప కూడా మద్యానికి బానిసైంది. శుక్రవారం ఇద్దరి మధ్య గొడవ జరగడంతో భార్య స్వరూప మెడపై గొడ్డలితో నరికాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
కల్తీ కల్లు తాగి ఒకరి మృతి
నిజామాబాద్: జిల్లాలోని బీర్కూరు మండలం సంగెం గ్రామంలో కల్తీ కల్లు తాగి ఒకరు మృతిచెందగా 15 మంది అస్వస్థతకు గురయ్యారు. కల్తీ కల్లు బాధితులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కల్తీ కల్లు బాధితుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
జిల్లాలో గతంలోనూ ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుని అనేక మంది మృతి చెందినా అబ్కారీ పోలీసులు మేలుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. కల్లు బట్టిల వద్ద లంచాలు తీసుకుని కల్తీ కల్లును ప్రోత్సహిత్సున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications