చెన్నైలో ఖరీదైన ప్రాపర్టీని అమ్మేసిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' సినిమాతో రికార్డుస్థాయి విజయాన్ని అందుకున్నారు. కానీ దీనికి ముందు విడుదలైన 'ఆచార్య' చిరు కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఒకరకంగా ఆయనకు పెద్ద షాక్ ఇచ్చింది. వాస్తవానికి చిరంజీవి కెరీర్ లో డిజాస్టర్లున్నాయి.. సాధారణ ఫ్లాపులున్నాయికానీ 'ఆచార్య' మాత్రం వాటన్నింటినీ మించిన పరాభవాన్ని మిగిల్చింది.

గాయపడిన చిరంజీవి మనసు
'ఆచార్య' తర్వాత కూడా తాను పాల్గొనే కార్యక్రమాల్లో ఈ సినిమా ప్రస్తావనను పదే పదే తెస్తుండటంద్వారా ఈ సినిమాకు సంబంధించి చిరంజీవి మనసు ఎంత గాయపడిందో అర్థమవుతోంది. ఎన్నో సినిమాలు ఫ్లాపై అభిమానులకు నిరాశనే మిగల్చగా 'ఆచార్య' మాత్రం చిరంజీవికి పూర్తి నిరాశను మిగిల్చింది. కనీసం ఈ సినిమాకు చిరంజీవి రేంజ్ లో కాకపోయినా నామమాత్రపు ఓపెనింగ్స్ కూడా రాలేదు.

అందరూ కలిసి మాట్లాడుకుంటే విజయాలు దక్కుతాయి
తాజాగా 'గాడ్ ఫాదర్' సక్సెస్ మీట్ లో చిరంజీవి మాట్లాడుతూ 'ఆచార్య'కు సంబంధించి పూర్తిగా దర్శకుడు చెప్పినట్లే తాము చేసుకుపోయామన్నారు. అయితే 'గాడ్ ఫాదర్' కు సంబంధించి సినిమా ఇంకా మెరుగ్గా రావడానికి క్లైమాక్స్ లో కొన్ని సన్నివేశాలు మళ్లీ చిత్రీకరించామని, ఒక ప్రేక్షకుడిలా సినిమా చూసి ఇన్ పుట్స్ ఇస్తుంటానని, వాటిని అమలు పరిస్తే సినిమాకు మంచి జరుగుతుందన్నారు. రాఘవేంద్రరావు లాంటి దర్శకులతో పని చేసినప్పుడు కూడా ఇలాగే ఇన్‌పుట్స్ ఇచ్చేవాడినన్నారు. అందరూ కలిసి మాట్లాడుకొని సమష్టి కృషితో తీస్తే విజయాలు దక్కుతాయన్నారు.

చెన్నైలో 'కృష్ణా గార్డెన్స్' అమ్మేశారు
సక్సెస్ మీట్ లో ఆ చిత్ర నిర్మాత ఎన్ వి ప్రసాద్ ఒక విషయాన్ని గుర్తుచేశారు. 'ప్రజారాజ్యం' పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం ద్వారా చిరు అమ్ముడుపోయారంటూ ఆయనపై నిందులు వేశారన్నారు. కానీ ఏం జరిగిందనే విషయం తనకు తెలుసన్నారు. అప్పట్లో చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్స్ పక్కనే ఉన్న 'కృష్ణా గార్డెన్స్' అనే ఖరీదైన ఆస్తిని అమ్మి పార్టీ కోసం చేసిన అప్పులన్నీ తీర్చేశారని వెల్లడించారు. చిరంజీవి కూడా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేదని, తనలాంటి అతి కొద్దిమందికే ఈ విషయం తెలుసన్నారు. చిరు గురించి 'ప్రజారాజ్యం' విషయంలో ఇప్పటికీ రకరకాలుగా మాట్లాడుతుంటారని, అందుకే తాను ఈ విషయాన్ని అందరి ముందు చెప్పాల్సి వస్తోందన్నారు. 'ప్రజారాజ్యం' తాలూకు కోపం, బాధ నుంచే జనసేన ఆవిర్భవించిందన్నారు. తనను టార్గెట్ చేసేవారితో కూడా చిరంజీవి మర్యాదగా మాట్లాడతారని, అది ఆయన సంస్కారమని, అందరినీ గౌరవిస్తారని ఎన్.విప్రసాద్ కొనియాడారు.












Click it and Unblock the Notifications