మెగాస్టార్ సినిమాలకు స్టార్లు కట్టిన ఏపీ మంత్రి.. రాత్రంతా థియేటర్ దగ్గరే ఉండి
మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు ఏపీ హెల్త్ మినిస్టర్. కళా రంగంలో మెగాస్టార్ చిరంజీవి, రక్షణ రంగంలో డీఆర్డీవో మాజీ చైర్మన్ జి.సతీష్ రెడ్డి తమ అసమాన సేవలతో తెలుగు జాతికి అంతర్జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు తెచ్చారని మంత్రి సత్యకుమార్ యాదవ్ కొనియాడారు. చిరంజీవి తన అద్భుత నటనా కౌశలంతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకుంటే, సతీష్ రెడ్డితన మేధస్సుతో భారత రక్షణ వ్యవస్థను అత్యంత బలంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు.
హైదరాబాద్‌లో ఆదివారం ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ పేరిట ఏర్పాటు చేసిన తొలి విశిష్ట పురస్కారాన్ని డాక్టర్ జి.సతీష్ రెడ్డికి ప్రధానం చేశారు. ఈ అభినందన సభకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేదికపై మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ చిరంజీవిపై తనకున్న అపరిమితమైన అభిమానాన్ని, అలాగే సతీష్ రెడ్డితో ఐదు దశాబ్దాలుగా ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకుంటూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

'కిరాతకుడు' సినిమా రోజులు.. థియేటర్ వద్ద స్టార్లు కట్టేవాళ్లం!
తాను 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు బళ్లారిలో పీయూసీ చదువుకునే రోజుల్లో చిరంజీవి సినిమాలంటే విపరీతమైన క్రేజ్ ఉండేదని మంత్రి సత్యకుమార్ తెలిపారు. అప్పట్లో చిరంజీవి కొత్త సినిమా విడుదలవుతుందంటే రాత్రంతా థియేటర్ దగ్గరే ఉండి పెద్ద పెద్ద స్టార్లు కట్టేవాళ్లమని గుర్తుచేసుకున్నారు.
'కిరాతకుడు', 'దొంగ మొగుడు' చిత్రాల విడుదలకు కూడా ఇదే విధంగా హంగామా చేశామని చెప్పారు. "ఆ సినిమాల పేర్లలో కాస్త ప్రతికూలత (నెగెటివిటీ) కనిపించవచ్చు గానీ, చిరంజీవిగారి మనసులో మాత్రం ఎలాంటి ప్రతికూలత ఉండదు.. ఆయన వెన్నలాంటి మంచి మనసున్న అసలైన మెగాస్టార్" అని సత్యకుమార్ ప్రశంసించారు. సాధారణంగా అందరికీ వయసుతో పాటు వృద్ధాప్యం వస్తుందని, కానీ చిరంజీవి, సతీష్ రెడ్డిలను చూస్తుంటే రోజురోజుకూ మరింత యువకులుగా, ఉత్సాహంగా కనిపిస్తున్నారని చమత్కరించారు.
కలాం నాడే చెప్పారు.. సతీష్ రెడ్డిగొప్పదనం!
సతీష్ రెడ్డిప్రతిభను మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పాతికేళ్ల కిందటే గుర్తించారని మంత్రి వివరించారు. "సతీష్ రెడ్డి ఎంతో ప్రతిభావంతుడు, భవిష్యత్తులో దేశానికి శాస్త్రీయ సలహాదారుగా, డీఆర్‌డీవో (DRDO) అధిపతిగా ఎదుగుతారు" అని కలాం అప్పట్లోనే జోస్యం చెప్పారని గుర్తుచేశారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు సతీష్ రెడ్డిని అదనపు వ్యక్తిగత కార్యదర్శిగా రమ్మని అడిగినప్పుడు, రాజకీయ పదువుల కంటే శాస్త్ర పరిశోధనల రంగంలోనే కొనసాగాలని తాను సలహా ఇచ్చానని తెలిపారు. కలాం గారు ఊహించినట్లే సతీష్ రెడ్డి దేశ రక్షణ రంగంలో అద్భుతాలు సృష్టించారని చెప్పారు.
ఆయన ఇచ్చిన సమాచారంతో సభలో చప్పట్లు కొట్టించారు!
సతీష్ రెడ్డి సమయస్ఫూర్తిని, సహాయ గుణాన్ని గుర్తుచేసుకుంటూ మంత్రి ఒక ఆసక్తికర సంఘటనను పంచుకున్నారు. ఒకానొక కార్యక్రమంలో తాను రక్షణ రంగంపై మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ప్రసంగానికి సరిగ్గా కొన్ని నిమిషాల ముందు సతీష్ రెడ్డికి ఫోన్ చేశానని చెప్పారు. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఆయన కేవలం 15 నిమిషాల్లోనే దేశీయ రక్షణ ఉత్పత్తులు, ఎగుమతులు, యుద్ధ విమానాల తయారీపై సమగ్రమైన డేటాను పంపారని తెలిపారు. ఆ వివరాలతో తాను మాట్లాడటంతో సభలో అందరూ తన పరిజ్ఞానాన్ని మెచ్చుకొని చప్పట్లు కొట్టారని, అయితే ఆ చప్పట్లు నిజానికి సతీష్ రెడ్డిఅందించిన జ్ఞానానికి దక్కినవని మంత్రి నిజాయితీగా చెప్పారు. ఒకప్పుడు చిన్న చిన్న రక్షణ పరికరాల కోసం విదేశాల వైపు చూసిన భారత్, నేడు స్వదేశంలోనే అత్యంత ఆధునిక క్షిపణులు, యుద్ధ విమానాలను తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరడంలో సతీష్ రెడ్డిపాత్ర ఎంతో కీలకమైనదని కొనియాడారు.
కరోనా కష్టకాలంలో దేశానికి ఆపద్బాంధవుడు!
కరోనా మహమ్మారి విరుచుకుపడిన తీవ్రమైన పరిస్థితుల్లో డీఆర్‌డీవో అధిపతిగా సతీష్ రెడ్డి దేశానికి గొప్ప అండగా నిలిచారని మంత్రి సత్యకుమార్ తెలిపారు. దేశంలో పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు, వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉన్న సమయంలో విదేశాలపై ఆధారపడకుండా స్వదేశంలోనే వాటి తయారీని వేగవంతం చేశారని గుర్తుచేశారు. పదవీ విరమణ పొందిన తర్వాత కూడా సతీష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారుగా సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఏపీకి డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లో భారీ పెట్టుబడులు తీసుకురావడానికి, తద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆయన చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని ప్రశంసించారు.
చివరగా, బీవీ పట్టాభిరామ్ మెమోరియల్ తొలి పురస్కారాన్ని సతీష్ రెడ్డికి ప్రధానం చేయడం, దానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రావడం ఈ కార్యక్రమానికి ఎంతో శోభను తెచ్చిపెట్టిందన్నారు. ఈ సభకు సాధారణ శ్రోతగా వచ్చిన తనను వేదికపైకి ఆహ్వానించి మాట్లాడే అవకాశం కల్పించిన ఎమెస్కో విజయకుమార్‌కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications